ఎన్నికలకు ముందు కర్నూలు జిల్లాలో పెద్ద వికెట్ పడిపోయింది. సీనియర్ నేత ఇరిగెల రాం పుల్లారెడ్డి తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేశారు. మద్దతుదారులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో రాం పుల్లారెడ్డి తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. తన రాజీనామాకు ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియతో పాటు పార్టీ నాయకత్వమే కారణమంటూ మండిపడ్డారు. భూమా అఖిలప్రియ భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అఖిలప్రియ అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని తాను పార్టీ నాయకత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. అందుకే వేరే దారిలోకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 

జిల్లాలోని తెలుగుదేశంపార్టీకి చెందిన సీనియర్ నేతల్లో ఇరిగెల రాం పుల్లారెడ్డి కూడా ఒకరు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి ఇరిగెల చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆళ్ళగడ్డలో పోటీ చేయాలనేది రాం పుల్లారెడ్డి పట్టుదల. అయితే, స్వయంగా ఫిరాయింపు మంత్రి అఖిలే ఆళ్ళగడ్డలో ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు వచ్చే అవకాశం లేదు. అలాగని నంద్యాలలో పోటీ చేయాలన్నా సిట్టింగ్ ఎంఎల్ఏ భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. అంతేకాకుండా మరో సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి కూడా రెండు నియోజకవర్గాల్లోను టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో ఇరిగెలకు టిక్కెట్టు దక్కేది అనుమానంగా మారింది.

 

అందుకే పోటీకి అవకాశం లేదు కాబట్టి ఆర్దికంగా బలోపేతమవుదామని అనుకున్నారు. అందుకు ఫిరాయింపు మంత్రి అఖిలప్రియ అడ్డుపడుతోంది. రాం పుల్లారెడ్డి పనులకు ఎప్పటిప్పుడు భూమా అడ్డుపడుతోంది. దాంతో అదే విషయాన్ని ఇరిగెల పార్టీ నాయకత్వానికి చాలాసార్లే చెప్పారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో రాంపుల్లారెడ్డికి ఏం చేయాలో అర్ధం కాలేదు. అదే సమయంలో మద్దతుదారుల నుండి ఒత్తిళ్ళు మొదలయ్యాయి.  ముందు టిడిపికి రాజీనామా చేసి బయటపడదామని నిర్ణయించుకున్నారు. అందుకనే ఈరోజు తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. వైసిపిలో చేరటానికి కూడా అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ కూడా పోటీకి అవకాశం లేదు. కాబట్టి మిగిలింది జనసేన మాత్రమే. మరి ఇరిగెల ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: