సినీనటుడు ప్రకాశ్ రాజ్ రానున్న ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. నూతన సంవత్సరం సదర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పిన ప్రకాశ్ రాజ్ పనిలో పనిగా ఎంపిగా పోటీ చేయాలన్న తన కోరికను కూడా వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పారు. అందరి మద్దతులో రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అదికూడా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోయేది తొందరలోనే చెబుతానన్నారు లేండి.

 

ప్రకాశ్ రాజ్ వరస చూస్తుంటే బహుశా మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుండే పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు అనుమానం వస్తోంది. ఎందుకంటే, మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దత్తత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో ప్రకాశ్ తరచుగా ఆ గ్రామంతో పాటు మండలం మొత్తంలో తిరుగుతున్నారు. అందులో భాగంగానే స్ధానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కూడా కలుస్తున్నారు. బహుశా ఆ విధంగానే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన వచ్చుంటుంది. దానికితోడు ఇప్పటికే అనేక సినిమాల్లో రాజకీయ నాయకునికిగా ప్రకాశ్ ఎన్నో పాత్రలను పోషించారు కదా ? రెండు విధాలుగాను ప్రకాశ్ పై ప్రభావం పడుంటుంది. అందుకనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్నారు.

 

కాకపోతే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే వాళ్ళెవరూ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుకోరు. ఉన్నంతలో ఏదో ఓ పార్టీ తరపున పోటీ చేసి గెలవాలనే చూస్తారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన రాజకీయ నేతలే చాలా తక్కువ. అటువంటిది ఓ సినీనటుడు అందులోను ఎంపిగా ఇండిపెండెంట్ గా పోటీ చేయటమన్నది సాహసం క్రిందే లెక్క. మరి ప్రకాశ్ కు స్వతంత్ర అభ్యర్ధిగా ఎంపిగా పోటీ చేయమని ఎవరైనా సలహా ఇచ్చారా లేకపోతే తానే నిర్ణయం తీసుకున్నారా అన్నది మాత్రం తెలీలేదు.  చూద్దాం తాను పోటీ చేయబోయే ఎంపి నియోజకవర్గాన్ని తొందరలోనే ప్రకటిస్తానని చెప్పారు కదా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: