ఓటర్లను ఎపుడూ మభ్యపెట్టకూడదు, వారికి నీళ్ళు, పాలూ ఏమీ తెలియవు అనుకోవడం కూడా పొరపాటే. గత దశాబ్దంగా దేశంలో మొబైల్ విప్లవం మొదలైంది. దాంతో పాటే ఓటర్లలో మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరో ఏదో చెబితే జనం విని నమ్మేసే రోజులు ఇపుడు కావు. ఆ తరం అంతరించిపోయింది. ఇంకా  అలాగే సంప్రదాయ రాజకీయాలు చేయాలనుకునే వారు రాజకీయ గణితంలో ఎపుడూ ఫెయిల్ అవుతూనే ఉంటారు.


తెలంగాణా నమూనా :


తెలంగాణా ఎన్నికలు జరిగి నెల రోజులు కావస్తోంది. ఆ ఫలితాల మీద దేశమంతా స్పందించింది. చివరిగా మాట్లాడిన వారు బహుశా మన ప్రధాని మోడీయేనేమో. ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో మోడీ తెలంగాణ ఎన్నికలపై  ఆసక్తికరమైన వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఫలితాలు రేపటి ఎన్నికల్లో దేశంలోనూ ప్రతిఫలిస్తాయని చెప్పుకొచ్చారు. అక్కడ ఒక్కడే కేసీయార్, మరో వైపు ఎన్నో పార్టీలు విడిగా, కలివిడిగా దండెత్తాయి. చివరికి అవన్నీ ఓటమి పాలు అయ్యాయి. కేసీయార్ గెలిచారు. రేపటి రోజున కేంద్రంలో కూడా అదే జరుగుతుందని మోడీ అనడం విశేషం. అంటే మహాకూటమి అక్కడ ఫెయిల్ అయింది, రేపు దేశంలోనూ ఇదే గతి అని మోడీ చెప్పారన్నమాట. 


దేశం వర్సెస్ కూటమి:


రేపటి ఎన్నికల్లో దేశం వర్సెస్ మహా కూటమి పోరాడుతుందని మోడీ విశ్లేషించారు. దేశ‌మంతా తన వైపు ఉంటే కూటమి మరో వైపు ఉండి విఫలమవుతుందని మోడీ ధీమాగా చెబుతున్నారు. నిజానికి మోడీ ఇలా చెప్పడానికి కొంత ఆధారం, తార్కిక కోణం  కూడా ఉంది. ఈ రోజున ఓటరు తెలివి మీరాడు, వారికి సరైన జవాబు చెప్పకుండా తార్కికమైన వాటికి అందకుండా పొందకుండా పొత్తులు పెట్టుకుంటే తప్పక తిరస్కరిస్తారని యూపీ ఎన్నికలు మొదలుకుని తెలంగాణా వరకూ ఈ మధ్య కాలంలో వరసగా  రుజువవుతూ వస్తోంది. 


మోడీని చూసే : 


2014లో మోడీ బీజేపీకి ప్రధాని అవుతారనే ఓటరు ఓటు చేశారు. రేపటి ఎన్నికల్లో కూటమి తరఫున ప్రధాని ఎవరో చెప్పకుండా ముందు ఓటేయండి ఆనక తేల్చుకుంటామని కూటమి నేతలు మభ్యపెట్టాలని చూస్తే కుదిరే వ్యవహారం కాదు, ఇదే తెలంగాణా తీర్పు చెబుతోంది. ఇదే మోడీ రేపటి గెలుపునకు కూడా బలాన్ని ఇస్తోంది.


మభ్యపెడితే అసలుకే ఎసరు :


గతంలోలా  సంకీర్ణ ప్రభుత్వాలను ఆరు నెలలు, మూడు నెలలు నడుపుతాము అంటే  జనం తప్పక తిరస్కరిస్తారు, పైగా అవకాశవాద పొత్తులపైన కూడా కళ్ళెర్ర చేస్తారు. ఇప్పటికైనా కూటమి  నేతలు తామంతా ఒక్కటి అని నిరూపించుకోవాలి, కూటమికి సారధ్యం వహించే  నాయకున్ని ఎన్నుకుని జనంలోకి వస్తే మోడీ పై గట్టిగా పోరాడగలరేమో కానీ ఇలా ఎన్నికల తరువాత ప్రధాని ఎవరో చెబుతామని   జనంలోకి వస్తే మాత్రం మళ్లీ మోడీకే ఎక్కువ సీట్లు వస్తాయి. ఆయనే మళ్ళీ ప్రధాని అయినా అవుతారు. ఇదే ఇప్పటి ఓటరు తీర్పు, మరి కూటమి పెద్దలు ఎలా సర్దుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: