ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ బయోపిక్స్ ను కొన్ని పార్టీలు తెరవెనుక నుంచి తెరమీదకు తెస్తున్నాయి. ఆయా పార్టీలు తమకు అనుకూలంగా ఈ సినిమాలను చిత్రీకరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కొందరికి ఈ సినిమాలంటే గిట్టట్లేదు. అందుకే వివాదాలు ముసురుకుంటున్నాయి.

 Image result for accidental prime minister

మన్మోహన్ సింగ్, బాల్ థాక్రే, ఎన్టీఆర్, వైఎస్.రాజశేఖరరెడ్డి.. ఇలా కీలకనేతల బయోపిక్స్ ఇప్పుడు శరవేగంగా రూపొందుతున్నాయి. మరికొన్ని రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సినిమాల చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. మన్మోహన్ సింగ్ పొలిటికల్ జర్నీపై రూపొందిన ఈ సినిమాలో సోనియా, రాహుల్ పాత్రలను కించపరిచేలా చిత్రీకరించారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇది హాట్ ఇష్యూగా మారింది.

 Image result for accidental prime minister

మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపన్ ఖేర్ నటించారు. మాజీ ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు రచించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకం ఈ సినిమాకు ఆధారం. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. విడుదలైన క్షణం నుంచే రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. మన్మోహన్ సింగ్ ను కీలుబొమ్మగా చేసి సోనియా, రాహుల్ తెరవెనుక నడిపించారంటూ ట్రైలర్ తెలియజేస్తోంది. యూపీఏ కాలంలో జరిగిన కుంభకోణాల వెనుక సోనియా, రాహుల్ లే ప్రధాన భూమిక పోషించారనేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రదర్శించబోమంటూ ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ముందు ఈ సినిమా ద్వారా లబ్దిపొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనేది కాంగ్రెస్ ఆరోపణ.

 Image result for bal thackeray biopic

ఇక శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందింది. థాక్రే జీవితంలోని కీలక సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. పత్రికా సంపాదకుడిగా, కార్టూనిస్టుగా జీవితం ఆరంభించిన థాక్రే.. రాజకీయాల్లో ఎలాంటి సెన్సేషన్స్ సృష్టించారనేది ఈ సినిమా సారాంశం. ఇటీవలే విడుదలైన థాక్రే సినిమా ట్రైలర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. అయితే ఇందులోని కొన్ని సన్నివేశాలు కొంతమందిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనేది ఆరోపణ. నాటి హోంమంత్రి మొరార్జీ దేశాయ్ ని అడ్డుకోవడం, ఇందిరా గాంధీతో జైహింద్, జై మహారాష్ట్ర అనే పలికించడం.. లాంటి సన్నివేశాలు ట్రైలర్ లో ఉన్నాయి. బాల్ థాక్రే కరుడుగట్టిన హిందూత్వవాది. అయితే ఆయన పాత్రను ముస్లిం అయిన నవాజుద్దీన్ సిద్ధికీ పోషించడం కూడా కొంతమందికి రుచించడం లేదు.

 Image result for ntr biopic

ఇక తెలుగుజాతికి గర్వకారణంగా నిలిచిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రెండు సినిమాలు రూపొందుతున్నాయి. ఆయన కుమారుడు బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతో రెండు సినిమాలను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. సినిమా నటుడిగా, రాజకీయ నేతగా ఎన్టీఆర్ ఎన్నో సంచలనాలు సృష్టించారు. అయితే ఆయన జీవితంలోనూ ఎన్నో ఉత్థానపతనాలున్నాయి. అవి కొంతమందికి రుచించడం లేదు. ఈ సినిమాలో తన పాత్రను కంచపరిస్తే సహించేది లేదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు హెచ్చరించారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి కూడా ఈ సినిమాపై గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది. సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రబాబును వెన్నుపోటుదారుడిలా చిత్రీకరిస్తూ విడుదలైన తొలిపాటపై ఇప్పటికే తీవ్ర దుమారం రేగుతోంది. ఇక మమ్ముట్టి హీరోగా వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కుతోంది. త్వరలోనే ఇది కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 Image result for yatra movie

ఇలా భారతీయ సినిమాలో పొలిటికల్ లీడర్స్ కాలం నడుస్తోంది. మరి కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమాల ప్రభావం ఎంతవరకూ ఉంటుంది.. ఎవరి జీవితాలను ఎలా చూపించబోతున్నారు.. ఆయా సన్ని వేశాల వెనుక పాత్రధారులెవరు.. సూత్రధారులెవరు.. లాంటి అంశాలు ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: