ఎల్లో మీడియా అని జగన్మోహన్ రెడ్డి పలిచే మీడియాకు సంబంధించి ఒకదానిలో యాత్ర సినిమా ట్రైలర్ గురించి బ్రహ్మాండంగా రావటం ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే, ఆ రెండు దినపత్రికలు అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మండిపడే పత్రికల్లో అవసరం ఉన్నా లేకపోయినా వైఎస్సార్ గురించి పూర్తి వ్యతిరేకంగానే వచ్చేది. వ్యతిరేకంగా రాయటానికి అవకాశం లేకపోతే సందర్భాన్ని కల్పించుకుని మరీ వైఎస్ గురించి వ్యతిరేకంగా రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది వైఎస్ బయోపిక్ యాత్ర సినిమా గురించి ఓ మీడియాలో బ్రహ్మాండంగా ఉందని, వైసిపి అభిమానులకు పండుగే అంటూ రివ్యూ రాయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి నటించిన యాత్ర బయోపిక్ ట్రైలర్ ను సినిమా నిర్మాతలు సోమవారం విడుదల చేశారు. నిజంగానే ట్రైలర్ బాగుంది. పాదయాత్ర చేయటానికి వైఎస్ ను పురికొల్పిన పరిస్ధితులు, మాట ఇచ్చేముందు వైఎస్ ఆలోచించినా మాట ఇచ్చిన తర్వాత మాత్ర వెనక్కు తగ్గని గుణాన్ని చూపించారు. ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్న ఓ రైతు వైఎస్ కు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. పక్కనే ఉన్న డాక్టర్ ఆయన మాట్లాడలేడు అని చెబుతాడు. అప్పుడు వైఎస్ స్పందిస్తూ ‘నాకు వినబడుతోందయ్యా’ అని వైఎస్ స్పందించినట్లే నటిస్తు మమ్ముట్టి చెప్పిన డైలాగ్ నిజంగా అద్భుతమే.

 

 2.15 నిముషాల నిడివిగల ట్రైలర్ లో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నిజంగా ఒదిగిపోయారనే చెప్పాలి. వివిధ సందర్భాల్లో వైఎస్ చెప్పిన డైలాగులను మమ్ముట్టి పాత్రలో పలికించిన తీరు, ఆ డైలాగులు చెప్పేటప్పుడు మమ్ముట్టి పలికించిన హావబావాలు బ్రహ్మాండమనే చెప్పాలి. ఒక పాత్రలో ‘రాజశేఖరా నువ్వు మారావని నమ్ముతున్నాను. ఈసారి నా ఓటు నీకే..నీ పార్టీకి కాదు’ అని చెప్పించటంలో కాంగ్రెస్ కు పడిన ఓట్లన్నీ వైఎస్ ను చూసే వచ్చాయి కానీ పార్టీకి కాదని చెప్పక్కనే చెప్పినట్లైంది.

 

2 నిముషాల ట్రైలర్లో ప్రధానంగా రైతు సమస్యలను, పేదలు ఇబ్బందులు పడే అనారోగ్య సమస్యలను బాగా హైలైట్ చేశారు. అన్నింటికన్నా భయకరమైన జబ్బు క్యాన్సర్ కాదయ్య పేదరికం అనే చెప్పేటప్పుడు మమ్ముట్టి నటన చూసి తీరాలి. ట్రైలర్ మాత్రం వైఎస్ అభిమానలతో పాటు వైసిపి శ్రేణులను బాగా ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు. సరే ట్రైలర్ ఎలాగుంది ? అభిమానులను ఆకట్టుకుంటుందా లేదా ? అన్న విషయాలను పక్కనపెడితే అసలు ఆ ట్రైలర్ గురించి సదరు మీడియాలో బ్రహ్మాండంగా ఉందని రాయటమే విడ్డూరం. సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదలకు ప్లాన్ చేస్తున్న బయోపిక్ ప్రభావం ఎలాగుండబోతోందో చూడాల్సిందే. సబితా ఇంద్రారెడ్డి పాత్రను సుహాసిని, వైఎస్ ఆప్తమిత్రుడు కెవిపి పాత్రలో రావు రమేష్ నటించారు. వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: