రాబోయే ఎన్నికలు మంచి రంజుమీదుండే అవకాశాలున్నాయి. మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను బొత్తిగా తీసి పారేస్తున్నారు. అసలు జనసేనను ఓ రాజకీయ పార్టీగాను, పవన్ ను దాని అధినేతగా గుర్తించటానికి జగన్ ఏమాత్రం ఇష్ట పడుతున్నట్లు లేదు. చూడబోతే జగన్ దృష్టిలో జనసేన అన్నది అసలు ఓ రాజకీయ  పార్టీయే కాదు.  జనసేన అంటే జగన్ దృష్టిలో కేవలం వైసిపికి పడతాయని అనుకుంటున్న ఓట్లను చీల్చటానికి చంద్రబాబునాయుడు సృష్టించిన జేబుసంస్ధ మాత్రమే. పవన్ వైఖరి కూడా దానికి తగ్గట్లుగానే ఉండటంతో అందరిలోను జగన్ స్టాండే కరెక్టేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్.

 

 జరగబోయే ఎన్నికల్లో పోటీ త్రిముఖమా లేక హ్యాండ్ టు హ్యాండా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఉండటానికి టిడిపి, వైసిపితో పాటు జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలున్నాయి. అయితే, కాంగ్రెస్, వామపక్షాలు, బిజెపి ప్రభావం చూపే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఇకపోతే  మిగిలింది జనసేన మాత్రమే. దాని స్ధాయి ఏంటో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కే అర్ధం కావటం లేదు. కాబట్టి జనసేన ఒంటరిగా పోటీ చేసినా చంద్రబాబుతో కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రభావం ఉండదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. జనసేన బలం కూడా పలానా జిల్లాల్లో ఎక్కువ అనటానికి కూడా సరైన ఆధారాలు లేవు.

 

పవన్ కాపు సామాజికవర్గానికి చెందిన వాడు కాబట్టి, ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువ కాబట్టి ఆ జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటున్నదే. మరి అదే నిజమైతే 2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవే పాలకొల్లులో ఓడిపోయారు. చిరంజీవి ఓడిపోవటమే కాకుండా పిఆర్పి అభ్యర్ధులకు కూడా చాలా చోట్ల అడ్రస్ గల్లంతైంది. మరి చిరంజీవీ కాపే, పోటీ చేసిన అభ్యర్ధుల్లో చాలామంది కాపులే. కాపుల్లో కూడా చాలామంది ఓట్లే. మరి అన్నింటా కాపులే అయినా పిఆర్పి దారుణ ఓటమి మూటకట్టుకుంది. చిరంజీవికన్నా పవన్ కల్యాణ్ గొప్పోడేమీ కాదు. దానికితోడు స్ధిరత్వం లేని పవన్ కు, దాదాపు 14 నెలలుగా పాదయాత్రతో జనాల మధ్యలోనే ఉన్న జగన్ కు నిజానికి ఏమాత్రం పోలిక లేదు. అన్నీ విషయాలను బేరీజు వేసుకునే పవన్ ను జగన్ బొత్తిగా లెక్క చేయటం లేదట. మరి జగన్ లెక్క ఎలాగుంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: