టీడీపీలో పెద్ద గొంతు వేసుకుని తెలారిలేస్తే విరుచుకుపడే ఓ నాయకునికి షాక్ తగిలింది. సొంత ఇంట్లోనే ఆయన్ని వ్యతిరేకిస్తూ సోదరుడే పార్టీకి గుడ్ బై అన్నాడు. అంతటితో ఆగకుండా ప్రత్యర్ధి వైసీపీలో చేరిపోయాడు. శ్రీకాకుళంలో జగన్ పాదయాత్రల చేరి పార్టీ తీర్ధం  పుచ్చుకున్నాడు. ఇది నిజంగా పసుపు పార్టీని కలవరపరచే అంశమే.


సోదరుడు జంప్ : 


సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోనేత టీడీపీకి షాకిచ్చారు. ప్రభుత్వం విప్‌, టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఈ రోజు వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.


బీసీలు ఇటువైపే :


బుద్ధా వెంకన్న ఏనాడూ బీసీల కోసం పోరాడలేదని, ఇంకా చాలమంది బీసీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దివంగత వైఎస్సార్‌ హయాంలోనే బీసీలకు ఎంతో మేలు జరిగిందని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటుచేస్తామని జగన్‌ హామీ ఇచ్చారని, బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పిస్తారని అన్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ పరిణామం టీడీపీకి ఓ విధంగా ఇబ్బంది కరమేనని చెప్పాలి. బీసీలు మా వైపేనని ఇన్నాళ్ళు జబ్బలు చరచుకున్న ఆ పార్టీకి ఎలాంటి ఝలక్ లు మరెన్ని తగులుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: