తెలుగు వారికి మూడు రోజుల పెద్ద పండుగ అతి ముఖ్యమైనది. ఏడాదిలో మిగిలిన రోజులు ఎక్కడ ఉన్న సంక్రాంతి అనేసరికి ప్రతీ వారు తమ సొంత ఊరికి బయల్దేరి వెళ్తారు. తాము పుట్టిన గడ్డ మీద సంబరాలు చేసుకోవాలని తహతహలాడతారు. ఏడాది కష్టం ఒక్కసారిగా దింపుకుని తమ నేల, చేలు చూసుకుని సేద తీరుతారు. ప్రక్రుతి ఒడిలోకి చేరి పరవశించిపోతారు.


పట్టణాలు ఖాళీ :


సంక్రాంతి ఆరంభం అయిందంటే చాలు పట్టణాలు పూర్తిగా ఖాళీ అయిపోతాయి. ఎక్కడి వారు అక్కడ గప్ చిప్ అన్నట్లుగా నాలుగు గోడల మధ్యన ఇరుకు గదుల్లో ఇరుకు మనసులతో, మనుషులతో బతుకులీడుస్తున్న వారంతా ఒక్కసారిగా స్వేచ్చా విహంగాలైపోతారు. నిర్మలమైన పల్లెటూర్లు, ప్రేమను పంచే పుట్టినిళ్ళకు చలో అంటూ బయల్దేరిపోతారు. అక్కడ అమ్మతనంతో పాటు సొంత వూరు వెచ్చదనం కూడా ఎంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటుంది. ఆదరించి కుశలం అడుగుతుంది. బాగున్నావా అంటూ పెద్ద దిక్కులా వాకబు చేస్తుంది. మరి బతుకు తెరువు కోసం పరుగులు తీస్తూ పట్టణాలలో మనవతా విలువలు కోల్పోతున్న వాతావరణంలో ఉంటూ ప్రేమ కోసం వెతుక్కునే వారందరికీ సంక్రాంతి రూపంలో పల్లేలు ఏడాదికి సరిపడా ప్రేమను పంచుతాయి.


మానసిక ఆనందం :


మనిషి కాలచక్రంలో బంధీగా మరి తనను తాను మరచిన వేళ మళ్ళీ ఎక్కడ తానున్నాడో చెప్పేది సంక్రాంతి. తొలి ఊపిరి తీసిన చోట మరింత ఆయుష్షు పోసుకోమంటూ దీవించి పంపేది గ్రామ సీమ. ఉపాధి  కోసం ఉరకలు పరుగులు పెడుతూ నాలుగు మెతుకులు తినీ తినక ఎలా బతికావు కొడకా అంటూ బాధపడి కడుపారా సకల పిండి వంటలతో భోజనం చేయమంటుంది. పల్లె తల్లి. కొత్త పంట ఇంటికి వస్తే ఆ వరి అన్నంతో అన్ని పిండి వంటలు చేసుకుని తాను తింటూ నలుగురిని పంచుతూ లోకానికి సౌభాగ్యాన్ని పంచమంటుంది సంక్రాంతి. అందుకే ఎన్ని తరాలు మారినా సంక్రాంతి సౌభాగ్యానికి లోటు లేదు, ఆ వేడుకకు సాటి వేరోకటి లేనే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: