రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు, ఎప్పటికపుడు కొత్త ఎత్తులు  వేయాల్సిందే. ఒకదానిలో పైచేయి అనేలోపుగా మరో వైపు షాక్ తగులుతుంది. అందులోనూ వర్తమాన రాజకీయాల్లో అందరూ ఎవరి ఆటలు వారు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. విలువలు, నీతులు వంటి వాటికి గోతులు తీసిపారేసి ఆడుతున్న ఈ విక్రుత క్రీడలో గెలుపు కు మలుపులెన్నో ఉంటున్నాయి. అందువల్ల ఇల్లు అలకగానే పండుగ కానే కాదు.


కూటమి కోటకు సవాల్ :


దాదాపు ఆరునెలలుగా దేశంలో ఒక రకమైన రాజకీయ వాతావరణం ఉంటూ వచ్చింది. మోడీకి గుజరాత్ లో తీవ్ర వ్యతిరేకత మధ్యన స్వల్ప ఆధిక్యంతో గెలుపు ని చూసిన తరువాత కేంద్రంలోని మోడీ సర్కార్ కి గ్రాఫ్ పడిపోయిందని అంతా అనుకోవడం మొదలైంది. దాన్ని బాగా గ్రహించిన చంద్రబాబు ప్రత్యేక హోదా కారణం చెప్పి గత ఏడాది బడ్జెట్ సెషన్లో ఆ పార్టీకి రాం రాం చెప్పి బయటకు వచ్చేశారు. ఆ తరువాత ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా అగ్గి రాజేస్తూనే జాతీయ స్థాయిలో  కూటమి కోసం ప్రయత్నాలు చేశారు. 


అలా కర్నాటకలో కాంగ్రెస్ తో కన్ను కలిపి తెలంగాణాలో చెట్టపట్టాలు వేసుకుని హస్తం నీడన చేరిపోయారు. ఇక దేశంలో మిగిలిన పార్టీలను కూడా కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు బాబు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తొలి అవాంతరంగా తెలంగాణా ఫలితాలు వచ్చాయి. అక్కడ తొడ కొట్టి మరీ కేసీయార్ రెండవ మారు గెలవడంతో బాబుకు  పెద్ద స్ట్రోకే తగిలింది. మరో వైపు కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశాలు పట్టి తిరగడం కూడా బాబును కలవరపరచింది. అయితే కొంతలో కొంత ఊరట ఏంటంటే ఉత్తరాది రష్ట్రాలలో బీజేపీ ఓడిపోవడం. దాంతో కూటమికి ఏ దశలోనైనా అవకాశాలు ఉంటాయేమోనని బాబు అనుకుంటూ వస్తున్నారు. దాన్ని ఇపుడు చెల్లా చెదురు చేస్తూ  బీజేపీ మోడీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేశారు.


అది బ్రహ్మాస్త్రమే :


బీజేపీ అమ్ముల పొది నుంచి వదిలిన అగ్ర వర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు అన్నది బ్రహ్మాస్రమే అని చెప్పుకోవాలి. ఉత్తరాదిన బీజేపీ ఓడినా స్వల్పమైన ఓట్ల తేడానే అక్కడ  ఉంది. అది కూడా నోటాకు అగ్ర వర్ణాలు చాలా చోట్ల ఓట్లు వేసి బీజేపీపీ కోపం అలా తీర్చుకున్నారు. అంటే వారు వేరే పార్టీకి వేసేందుకు ఇష్టపడలేదన్నమాట. అటువంటి వారిని దారికి తెచ్చేందుకు మోడీ ప్రయోగించిన ఈ ఆయుధం ఇపుడు గురి తప్పకుండా లక్ష్యాన్ని  చేదించింది. లోక్ సభ మాత్రమే కాదు, రాజ్యసభ కూడా ఈ బిల్లుని ఆమోదించింది. ఇక చట్టం అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది నిజంగా జాతీయ స్థాయిలో కూటామికి గట్టి దెబ్బగా మారితే మోడీ పార్టీ విజయావకాశాలను అమాంతం పెంచే విధంగా ఉండబోతోంది.


నో అన్న వారే :


ఇక కూటమి పేరిట పార్లమెంట్ లోనూ బయటా మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన వారే ఇపుడు ఈబీసీ బిల్లుకు మద్దతు ప్రకటించడం రాజకీయ అనివార్యత. అలా వారిని పద్మవ్యూహంలో పడేసి తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్న గండర గండడు గా మోడీ నిలిచారు. ఇక వివిధ రాష్ట్రాల్లో కాపులు, ముస్లిములు ఇలా అగ్ర వర్ణాలు రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఒక్క బిల్లుతో వారిని అందరినీ తన వైపుగా తిప్పుకున్న ఘనత కూడా మోడీకే దక్కుతుంది. అందువల్ల ఏపీ లాంటి రాష్ట్రాలో బీజేపీ వ్యతిరేకత గతం కంటే బాగా తగ్గవచ్చు. ఇక దేశంలో చూసుకుంటే మళ్ళీ హిందీ రాష్ట్రాలో ఆ పార్టీ పట్టు పెరగవచ్చు. ఇప్పటికి కూడా సర్వేలు మోడీ కూటమికి 250 సీట్లకు తక్కువ ఇవ్వడంలేదు. ఇపుడు ఈబీసీ అస్త్రంతో మోడీ టీం మ్యాజిక్ ఫిగర్ ని అవలీలగా దాటేసే అవకాశాలు చాలానే ఉన్నాయి.


కూటమి కి చిల్లే :


ఇక జాతీయ స్థాయిలో కూటమికి చిల్లేనని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. రాహుల్ నాయకత్వం అంటే బాబు తప్ప మిగిలిన వారు ఒప్పడంలేదు. ఇక హిందీ బెల్ట్ లోని రాష్ట్రాలో కాంగ్రెస్ గెలిచినా ప్రధాని పేరు మీద సర్వేలు పెడిటే మాత్రం మోడీకే మొగ్గు ఉంటోంది. అంటే లోక్ సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాలో సైతం రివర్స్ ఫలితాలు వస్తాయని తేలుతోంది. మమత, మాయావతి వామ‌పక్షాలు ఇలా అంతా కూడా ఎన్నికల తరువాత కూటములకే ప్రాధాన్యత అంటున్నారు.


పక్కన ఉన్న ఒడిషా సీఎం పట్నాయక్ తాను ఏ కూటమిలోనూ ఇపుడు ఉండనని అంటున్నారు. అంటే రేపటి రోజున కేంద్రంలో మోడీ టీం కి మెజారిటీ తగ్గితే బయట నుంచి మద్దతు ఇచ్చి తన రాష్ట్రం పనులు చేసుకునేందుకు పట్నాయక్ వ్యూహాత్మకంగా వుంటారని తేలిపోతోంది. ఇక తెలంగాణాలో కేసీయార్ కి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. ఆయన సైతం చివరి నిముషంలో మోడీకే జై కొడతారు. ఏపీలో వైసీపీకి కూడా మొగ్గు ఉంది ఇలా చూసుకుంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమికి విలువ ఏముంది.
దానికి అధికార కళ ఎలా వస్తుందన్నదానిపైనే ఇపుడు  చర్చ సాగుతోంది. కొసమెరుపు ఏంటంటే ఈబీసీ బిల్లు ఆమోదం తరువాత కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సిక్సర్ కొట్టాం, మరిన్ని అస్రాలు మా అమ్ములపొదిలో ఉన్నాయని అన్నారు. అవి కూడా బయట పెడితే కూటమి చెల్లా చెదురే, బాబు ఆశలు కూడా అవిరి కాక తప్పదంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: