ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. నిజానికి ఆరు నెలల నుంచే ఆ హడావుడి రాష్ట్రంలో  కనిపిస్తూ ఉంది. మరో వైపు తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు కూడా జరగడంతో ఆ వేడి ఏపీపైనా బాగానే పడింది. ఇపుడు జగన్ పాదయాత్ర పూర్తి కావడంతో పాటు అటు టీడీపీ సైతం జనంలోకి జోరుగా వెళ్ళడం, జనసేన సమీక్షలు ఇవన్నీ కలసి మొత్తం పరిస్తితులను ఎన్నికల వైపు తీసుకెళ్ళిపోతున్నాయి.


జగన్ తో జనం :


ఏపీలో చూసుకుంటే ఇపుడు గాలి ఎటువైపు వీస్తుందో స్పష్టంగా చెప్పలేకపోయినా వైసీపీ అధినేత పాదయాత్ర ముగింపునకు వచ్చిన జనాన్ని తీసుకుంటే ఓ సంకేతంగా భావించాలి. చిన్న పట్టణమైన ఇచ్చాపురంలో జనం ఓ రేంజిలో పోటెత్తారు. అది మామూలు విషయం కాదు, చలి వాతావరణం, ఏపీకి విసిరేసినట్లున్న మారు మూల ప్రాంతం అయినప్పటికీ జనం కట్టకట్టుకుని వచ్చారంటేనే వారిలో బలమైన ఆవేశం ఏదో ఉందనుకోవాలి. అదే జనాన్ని కదిలించి నడిపించిదనుకోవాలి.


ఇక అది కాకుండా జగన్ విజయనగరం రైల్వే స్టేషన్ కి వచ్చి అట్నుంచి తిరుపతి వెళ్లారు. మరి అక్కడ చూసుకున్నా జగన్ పోటెత్తారు. ఇక తిరుపతిలో జగన్ దిగినది మొదలుగా ఆయన వెంట తండోపతండాలుగా జనం వస్తూనే ఉన్నారు. జగన్ అలిపిరి వద్ద మెట్ల మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక తిరుమల గిరులలో ఎక్కడ చూసుకున్న జనమే కనిపించారు. ఇదంతా చూసిన వారు జగన్ ఏపీకి కాబోయే సీఎం ఆయనేనా  అన్నంతగా అనిపించింది, కనిపించింది. ఈ ధోరణి చూస్తే ఎన్నికలు వేడి వైసీపీ చుట్టూ బాగానే ఉందనిపిస్తోంది.


ప్రారంభొత్సవాలతో  :


ఇక టీడీపీ తీసుకుంటే సహజంగానే అధికారం చేతిలో ఉంది దాంతో పాటు ఆర్భాటం, హడావుడి ఎక్కువగానే చేస్తున్నారు. ధర్మపోరాట దీక్షలతోనే చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. ఆ తరువాత ఆయన జ్ఞానభేరి మోగించారు. మధ్యలో సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం కార్యక్రమాలు, ఇపుడు జన్మభూమి ఇలా ఏదో ఒక ప్రొగ్రాం ద్వారా ఏపీలో టీడీపీ ని జనంలోకి తీసుకుపోతూనే ఉన్నారు. ఈ మధ్యన కడపలో స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు. 


అలాగే ప్రకాశం జిల్లాలో పోర్ట్ కి పునాది రాయి వేశారు. ఇలా ఏది వదలకుండా రాళ్ళను పాతేస్తూ వాటిని తానే పూర్తి చేస్తానని చెబుతూ ముందుకు సాగిపోతున్నారు. మరో వైపు అమరావతికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తీసుకువచ్చి మరీ రాజధాని అభివ్రుద్ధిపై జనంలో కొత్త ఆశలను పెంచుతున్నారు. ఇవన్నీ చూసుకుంటే మాత్రం టీడీపీ వేడి ఓ లెక్కలో లేనట్లుగా ఉంది. ఎన్నికలకు మేము రేడీ అంటున్నారుగా.


సమీక్షలే :


జనసేనాని గత నెల రోజులుగా జనంలోకి రాకుండా గదుల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే పార్టీని గేరప్ చేస్తున్నారన్నమాట. తాము ఎక్కడ ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం అన్నది మధనం చేసుకుంటున్నారు. ఇక పనిలో పనిగా వామపక్షాలతో పొత్తులు కలిపేశారు. ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నాయి. పండుగ తరువాత భేటీలో తుది కసరత్తు మొదలవుతుంది. మొత్తానికి పవన్ పార్టీ జనసేనలో ఎన్నిలల హడావుడి బాగానే పెరిగిందనుకోవాలి.


20న నిర్ణయం :


ఇదిలా ఉండగా ఏపీలో మేమున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పొత్తులపై ఈ నెల 20న నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. పొత్తులకు సంబంధించి రాహుల్ గాంధి  ఇదే విషయం ఏపీ పార్టీ నాయకులకు స్పష్టం  చేశారట. తెలంగాణాలో కలసి పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీ ఏపీ ఎన్నికల్లోనూ కలసి పోరాడాలని ముందు అనుకున్నాయి. అక్కడి ఫలితాలు చూసిన తరువాత రకరకాల అభిప్రాయాలు రెండు పార్టీల్లోనూ కలుగుతున్నాయి.


 మొత్తానికి చూసుకుంటే పొత్తులు లేకపోయినా కాంగ్రెస్ టీడీపీ మాత్రం ఇప్పటికే మిత్రులుగా మెలుగుతున్నారు. ఒకవేళ బహిరంగంగా పొత్తులు పెట్టుకోకపోయినా లోపాయికారీ సాయం చేసుకుంటారన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే ఎన్నికల వేడి మొదలైంది.సంక్రాంతికి కోడి పందేలు ప్రారంభమైతే ఆతరువాత అసలైన రాజకీయ పందెం కోళ్ళు బరిలోకి దిగుతాయన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: