ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశంపార్టీ జన్మభూమి అని, ధర్మపోరాట దీక్షలని ఏవేవో పేర్లతో జనాల్లో చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మొన్నటి వరకూ ప్రధాన ప్రతిపక్షం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో హోరెత్తించేశారు. సరే టిడిపి ఏ కార్యక్రమం పెట్టినా ప్రధాన టార్గెట్ కేంద్రంలోని నరేంద్రమోడి, రాష్ట్రంలోని జగన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికార పార్టీకున్న అడ్వాంటేజెస్ ను గమనించిన వైసిపి వినూత్నంగా ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అదే ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమం.

 

మరో మూడు నెలల్లో షెడ్యూల్ ఎన్నికలు ఎలాగూ జరగబోతున్నాయి కదా ? అందుకనే జనాల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను మరింతగా పెంచేందుకు వైసిపి నిన్ను నమ్మం బాబు అనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన వైసిపి వినూత్నంగా చేపట్టింది. ఇందులో అగ్రభాగం వైసిపికి మద్దతుగా నిలబడే సోషల్ మీడియాదే అనటంలో సందేహం లేదు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్దానాలు, నెరవేరిన తీరు తదితరాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని జనాలను కూడా వైసిపి శ్రేణులు కలుస్తు చంద్రబాబుకు వ్యతిరేకంగా పాంప్లేట్లు పంచుతున్నారు.

 

గ్రామాల దగ్గర నుండి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టర్లు అంటిస్తు కటౌట్లు ఏర్పాట్లు చేశారు. దాంతో అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్షం చేస్తున్న నిరసన కార్యక్రమాలు కూడా జనాలను ఆకట్టుకుంటోంది. దాని ఫలితంగానే ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమిలో జనాలు మంత్రులు, ఎంఎల్ఏలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఎలాగూ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, అందులోను టిడిపి తిరిగి గెలిచేది అనుమానమే అన్న ధైర్యంతోనే జనాలు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా విరుచుకుపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పాల్గొన్న నారా లోకేష్ కూడా జనాల ధాటికి తట్టుకోలేక చివరకు కార్యక్రమం మధ్యలోనే వెళ్ళిపోయారంటే ఏమిటర్ధం ?


మరింత సమాచారం తెలుసుకోండి: