ఏపీలో కాపుల పరిస్థితి ఎలా ఉందంటే జనాభా పరంగా మంచి సంఖ్యలో ఉన్నా ఓట్ల రాజకీయం వారిని ఎటూ కాకుండా చేస్తోంది. ఆశల పల్లకిలో ఊరించి వారిని గగన విహారం చేయిస్తున్నారు తప్ప వారు కోరుతున్న డిమాండ్ మాత్రం నెరవేరడం లేదు. పోరాటాలు, ఉద్యమాలు ఎన్ని చేసినా వారికి ఫలితం రావడం లేదు. ఈ లోగా మరిన్ని కొత్త వ్యూహాలు, పాలిట్రిక్స్ తో కాపులతో చెలగాటం ఆడుతున్నారు.


బీసీ నుంచి ఓసీలోకా :


కాపులలో బీసీలు, ఓసీలు కూడా ఉన్నారు. ప్రాంతాల వారీగా వారి కుల విభజన అలా జరిగింది. మిగిలి ఉన్న కాపులు కూడా తమను బీసీలో చేర్చాలని దాదాపుగా పాతికేళ్ళుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అప్పట్లో కోట్ల విజయభాస్కరరీడ్డి సర్కార్  ఓ జీవోను తీసుకువచ్చినా కోర్టులు కొట్టేయడంతో తరువాత ప్రభుత్వాలు ఆ సాహసాన్ని చేయలేకపోయాయి. రాజ్యాంగ పరమైన అవరోధాలు ఇతరత్రా   సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న రాజకీయ పార్టీల పెద్దలు కాపులను బీసీలలో చేర్చే అంశంపై ఆచీ తూచీ వ్యవహరిస్తూ వచ్చాయి. 
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం 2014 ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ  ఓ హామీ ఇచ్చేశారు. దాని కోసం తరువాత అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ వరకూ మరచిపోయారు. కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం పోరాటాల ఫలితంగా కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో ఓ మొక్కుబడి తీర్మానం చేసేసి కేంద్రానికి దాన్ని పంపించి చేతులు దులుపుకున్నారు. అది ఎటూ జరిగేది కాదని అందరికీ తెలుసు, దాంతో కాపులు గుర్రుమంటూనే ఉన్నారు. ఇపుడు ఎన్నికల వేళ బాబు మరో కొత్త డ్రామాకు తెర తీశారు. కాపులను ఈసారి బీసీల్లో కాదు ఓసీల్లో మరో మారు కలిపేస్తూ ఈబీసీ రిజర్వేషనల్లో అయిది శాతం కోటా వాటా అంటూ కొత్త కధ వినిపిస్తున్నారు.


సబ్ కోటా చెల్లదా :


బాబు తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం  కేంద్రం కొత్తగా ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లో పది శాతం నుంచి అయిదు శాతం కాపులకు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విధంగా ఈబీసీ కోటాను బద్దలు కొట్టడానికి వీలులేదని, సబ్ కోటాను రూపకల్పన చేయడానికి రాజ్యాంగపరంగా అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయ నిపుణులు సైతం ఇది కోర్టుల్లో నిలబడే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. అయినా కాపులకు ఏదో  చేశేశామని చెప్పుకోవడానికి చంద్రబాబు సర్కార్ తెగ ఆరాటపడుతోంది.


అయినా వస్తాయిగా :


ఇక్కడొక సూక్షమైన విషయం ఉంది. కాపులను వారి మానాన వదిలేసినా అందులో పేదలకు కేంద్రం చేసిన రిజర్వేషన్ కోటా నుంచే రిజర్వేషన్ల రాయితీలు ఎలాగూ వస్తాయి.  అందులో టీడీపీ వేలు పెట్టి కొత్తగా చేసింది ఏమీ లేదు. మరో వైపు గిరి గీసి కాపులకు రిజర్వేషన్లు ఇంతశాతం అనడం వల్ల మిగిలిన అగ్ర కులాల మధ్య చిచ్చు పెడుతున్నారనుకోవాలి. బీసీలో చేరుస్తామని చెప్పినపుడు ఆయా వర్గాలు గోల పెట్టాయి. సామజికపరమైన సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాపులకు, బీసీలకు ఇప్పటికీ ఏదో తెలియని ద్వేష పూరిత వాతావరణం అలా తయారైంది. దానికి బాధ్యత రాజకీయం చేసిన వారు స్వీకరిస్తారా. ఇపుడు మళ్ళీ మరో మారు కాపులను అగ్ర కులాల మీదకు ఎగదోసి చలి మంట కాచుకోవాలని చూస్తున్నారు. దీంతో ఈ కులాల మధ్య కూడా సామరస్య వాతారరణం దెబ్బతింటే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారు.


బీసీ అని చెప్పి :


నిజానికి కాపులు కోరిందేమిటి, టీడీపీ చేసిందేమిటి, ఈ అయిదేళ్ళలో ఎన్ని పిల్లి మొగ్గలు వేశారు. కాపులు బీసీల్లో తమ కులాన్ని చేర్చమన్నారు. ఇపుడు కేంద్రంలో మోడీ సర్కార్ చేసినట్లుగానే రాజ్యాంగ సవరణ చేయడమో, మరే మార్గాల ద్వారానే వారిని బీసీలో చేర్పించవచ్చు, నిన్నటి వరకూ కేంద్రంతో అంటకాగిన తెలుగుదేశానికి మరి ఈ చురుకు ఎందుకో పుట్టలేదు. ఇపుడు మాత్రం ఈబీసీ కోటాలో నా వాటా అంటూ బాబు వేలు పెట్టి మరి కొత్త చిచ్చు పెడుతున్నరని అంటున్నారు. 
కాపులను బీసీలో చెరిస్తే వచ్చే ప్రయోజనాలు వేరు, ఈబీసీ కోటాలో సబ్ కోటాలో పెట్టడం వల్ల ఒనగూడేది ఏముంది. పైగా, పెద్ద కులాలతో పేచీ పెట్టడం తప్ప. ఇదంతా ఓట్ల కోసం ఆడుతున్న నాటకం. కాపులు ఇప్పటికి చాలా సార్లు ఇలా నమ్మి మోసపోయారు. ఇపుడు మరో మారు చంద్రబాబు వారికి వల వేస్తున్నారు. దానికోసం కులాల మధ్య ఘర్షణ పెట్టే పులి జూదమే ఆడుతున్నారు. అయినా కాపులు నమ్ముతారా.



మరింత సమాచారం తెలుసుకోండి: