ఏపీలో చంద్రబాబుకు, జగన్ కి మధ్యన రెండవ మారు ఎన్నికల   యుద్ధం జరగనుంది. చంద్రబాబు తన రాజ‌కీయ జీవితంలో ముఖా ముఖీ పోరును ఇప్పటికి అయిదు మార్లు ఎదుర్కొంటే  అందులో రెండు మార్లు గెలిచారు. ఇది అయిదవసారి. తండ్రి వైఎస్, కొడుకు జగన్లతో చంద్రబాబుకు ఈ ముఖా ముఖీ పోరు  ఇరవై ఏళ్ళుగా  సాగుతూ వస్తోంది. ఈసారి పోరు లో విజేత ఎవరో...


వైఎస్ అపుడలా :


ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా  ఉంటూ తన నాయకత్వంలో ఎదుర్కొన్న తొలి ఎన్నిక 1999లో వచ్చింది. అప్పట్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ సారధిగా ఉంటూ బరిలోకి ఉత్సాహంగా దూసుకువచ్చారు. ఆ ఎన్నికల్లో గెలుపు ఇక ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 90 సీట్ల వద్దకు వచ్చి వైఎస్ నాయకత్వంలోకి కాంగ్రెస్ ఓడిపోయింది. బాబు అప్పట్లో కేంద్రంలోని వాజ్పేయి సర్కార్ పతనం తరువాత వచ్చిన సానుభూతి, కార్గిల్ పోరు వంటి కారణాలు కలసిరావడంతో గెలిచేశారు.
ఇక 2004 కు వచ్చేసరికి అప్పటికే తొమ్మిదేళ్ళ అధికారంతో వ్యతిరేకత, పదునైన వైఎస్ వ్యూహాలు, సమిష్టిగా కాంగ్రెస్ పోరు, వామపక్షాలు, టీయారెస్ తో సర్దుబాట్లు అన్ని కాలసి చంద్రబాబు సర్కార్ ని దించేశాయి. 2009 లో ఏ పార్టీతో పొత్తు లేకుండా  కాంగ్రెస్ అధికారాంలో ఉంటూ వైఎస్ నాయకత్వంలో పోటీకి వస్తే చంద్రబాబు టీయారెస్, కామ్రెడ్స్ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా ఓడిపోయారు. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వల్ల టీడీపీ దెబ్బ తిందని అంటారు.


జగన్ తో తొలిసారి :


ఇక జగన్ నాయకత్వంలోని వైసీపీతో తొలిసారి చంద్రబాబు టీడీపీ 2014లో తలపడింది. విభజన ఏపీకి అనుభవం కలిగిన నాయకుడు కావాలని నినాదం, మోడీ హవా, పవన్ సినీ గ్లామర్, కాపుల మద్దతు అన్నీ కలసి బాబుని గెలిపించాయి. అయితే ఇక్కడ వైసీపీ అనుభవలేమి కూడా టీడీపీకి విజయాన్ని అందించిందని కూడా చెప్పుకోవాలి. మళ్ళీ 2019 ఎన్నికలు వస్తున్నాయి.  ఇపుడు కూడా వైసీపీ, టీడీపీ ల మధ్యనే పోరు భీకరంగా సాగుతుంది. అయిదేళ్ళ అధికారం అనుభవించిన తరువాత చంద్రబాబు ఎన్నికలకు వస్తున్నారు. ఆయన పాలన పట్ల జనాలకు మోజు తగ్గిందా, అలాగే ఉందా, లేక వేరే ఆప్షన్ ఎంచుకోలేరా అన్నది కూడా ఇక్కడ చర్చకు వస్తుంది.


అధికారంలో బాబు :


ఈసారి ఎన్నికలకు, గతసారి ఎన్నికలకు ఓ పెద్ద తేడా ఉంది. అది వైసీపీ గుర్తించిందో లేదో తెలియదు. గతసారి రాష్ట్రపతి పాలనలో ఏపీ ఎన్నికలు జరిగాయి. బాబు, జగన్ ఇద్దరూ కూడా ప్రతిపక్షంలో  ఉంటూ పోరాడారు. ఈసారి అలా కాదు, బాబు చేతిలో అధికారం అనే మంత్ర దండం ఉంది. అసలే బాబు రాజకీయ చతురుడు, వ్యూహకర్త, దానికి తోడు అధికారం కూడా చేతుల్లో ఉంది. మరి  అటువంటి బాబుతో ఢీ కొనడం అంటే వైసీపీ 2014 కి మించి కష్టపడాలి. పదునైన వ్యూహాలను కూడా చూసుకోవాలి
 పైగా ఇపుడు చూస్తే బహుముఖ పోటీలు కూడా జరుగుతున్నాయి. వీటిని అన్నీ గమ‌నించి  ఎత్తుకు పై ఎత్తు వేసినట్లైతేనే వైసీపీకి విజయం దక్కేది. మొత్తం మీద చూసుకుంటే తండ్రీ కొడుకులతో ఇప్పటికి నాలుగు యుధ్ధాలు చేసిన బాబు రెండింటిలో గెలిచారు. రెండు వైఎస్ గెలిచారు. ఈ పోరాటంలో జగన్ గెలిస్తే హ్యాట్రిక్ కొడతారు.  ఒకవేళ బాబు గెలిచినా అదే జరిగేది.  మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: