బీసీలు అంటే ఎన్నికలలో ఓట్లు అని ఇప్పటికీ రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఏదో విధంగా తాయిలాలు ప్రకటించి మచ్చిక చేసుకుంటే ఎన్నికల గోదారికి ఈదేయవచ్చు అన్న ధోరణి పార్టీల్లో కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీదే అధికారం. మరి  ఆ అధికారం బీసీలకు దక్కుతోందా. రాజకీయాల్లో  నిర్ణయాత్మకమైన పాత్ర వారు పోషించగలుగుతున్నారా.


ఎనిమిది మంది మంత్రులట :


తెలుగుదేశం పార్టీ జయహో బీసీ అంటూ రాజమహేంద్రవరంలో అట్టహాసంగా నిర్వహించింది. ఈ మీటింగుకు పెద్ద ఎత్తున  బీసీలను తరలించారు. ఈ మీటింగులో చంద్రబాబు బీసీలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోశారు. అంతా బాగానే ఉంది. కానీ బీసీలకు బాబు సర్కార్ ఏం చేసింది. పార్టీగా తెలుసుదేశం ఏం చేసింది అని విశ్లేషించుకున్నపుడు నిరాశే కలుగుతుంది. పసుపు పార్టీలో మమేకమైన బీసీ తమ్ముళ్ళకు బాబు చేసింది బాగానే ఉండవచ్చు కానీ నిజమైన బీసీలకు మాత్రం ఏం జరిగిందని ఆలోచన చేస్తే శూన్యమే. ఎనిమిది మంది బీసీ మంత్రులను తన క్యాబినెట్లో తీసుకున్నానని బాబు గారు చెబుతున్నారు. అంటే మొత్తం మంత్రి మండలిలో అది మూడవ వంతు.


సరిపోతుందా :


నిజానికి రష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు అధికారంలో ఇంకా మూడవ వంతు మాత్రమే ఇచ్చి తమది బీసీల ప్రభుత్వం అని బాబు ఎలా చెప్పగలుగుతున్నారు. ఇక మంత్రులను చేయడం వరకూ బాగానే ఉన్న వారికి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా. ఉప ముఖ్యమంత్రి  కేయీ క్రిష్ణ మూర్తి రెవిన్యూ మంత్రి అయి ఉండి కూడా తన శాఖపై అధికారం చేయలేని దుస్థితి. ప్రపంచం గర్వించే అమరావతి రాజధాని కడతామనుంటున్న టీడీపీ సర్కార్ అందులో ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఏ మాత్రం  సంబంధం లేని మునిసిపల్ మంత్రి నారాయణకు పెత్తనం ఇచ్చారు. అది కూడా బాబుల కనుసన్నల్లోనే అంతా జరుగుతుంది. మరి బీసీని డిప్యూటీ సీఎం చేశామని చెప్పడం ఎందుకు.


పార్టీలోనూ అదే :


ఇక టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తెలంగాణా, ఆంధ్ర శాఖలకు ఇద్దరు బీసీ నేతలు కళా వెంకటరావు, రమణలను అధ్యక్షులుగా చేశామని చెప్పుకున్నారు. తెలంగాణా ఎన్నికలు జరిగితే అక్కడ బాబు తప్ప రమణను ఎవరూ పట్టించుకోని స్థితి. ఇక రమణ సొంతంగా ఎమ్మెల్యే అభ్యర్ధిని కూడా డిసైడ్ చేయలేని వాతావరణం పార్టీలో ఉంది. ఏపీలో చూసుకుంటే కళా వెంకటరావు పరిస్థితి కూడా  అంతే బాబు ఏపీ పార్టీ వ్యవహారాలు మొత్తం చక్కబెడతారు. పేరుకు మాత్రమే కళా అధ్యక్షుడు. ఇలా ఉత్సవ విగ్రహాల్లా పదవులు పంచి బీసీలకు పెద్ద పీట వేశామని చెప్పుకోవడం టీడీపీకే చెల్లిందిగా.


సీఎం అభర్ధిగా ప్రకటిస్తారా:


నిజానికి టీడీపీ జాతీయ పార్టీ అంటున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏపీకి బీసీ నేతను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించగలరా అని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తన కుమారుడు లోకేష్ ని కుర్చీ మీద కూర్చోబెట్టాలన్న ఆరాటం తప్ప బీసీలకు అంత ఉదారంగా పెద్ద సీటు ఇస్తారా అని వారు విమర్శలు చేస్తున్నారు. ఇక బీసీలకు ఆదరణ పధకం , పనిముట్లు ఇచ్చామని చెప్పడం ద్వారా ఇంకా రెండు దశాబ్దాల  వెనకకు తీసుకుపోతున్నారే తప్ప అసలైన రాజ్యాధికారం ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారని కూడా బీసీ వర్గాలు నిలదీస్తున్నాయి. వారు చేతి వ్రుత్తులే చేసుకోవాలి. అగ్ర వర్ణాలే ఎపుడూ అందలం ఎక్కాలా అని కూడా ప్రశ్నిస్తున్నాయి. మరి దీనికి జవాబు చెబితేనే జయహో బీసీ అనగల అవకాశం టీడీపీకి ఉంటుంది. లేకపోతే  అది తూతూ మంత్రం నినాదమే అవుతుందని కూడా అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: