అసెంబ్లీలో తమ గొంతు నొక్కేస్తున్నారని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని వైసిపి చాలా కాలంగా అధికార పార్టీతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది.  ఫిరాయించిన తమ ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోమని ఎంతగా డిమాండ్ చేసినా స్పీకర్ పట్టించుకోవటం లేదన్న ఆరోపణలతో చివరకు వైసిపి సభ్యులు అసెంబ్లీ సమావేశాలే బహిష్కరిస్తున్నారు. వాస్తవాలిలా ఉంటే స్పీకర్ మాత్రం తనకు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం లేదని ఎదురు ఆరోపిస్తుండటం విచిత్రంగానే ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, 30వ తేదీ అంటే బుధవారం నుండి శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. ఓట్ ఆన్ అకౌం బడ్జెట్ సమావేశాలే లేండి. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ప్రధాన్యత కలిగినవి కాబట్టి ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా పిలుస్తానని స్పీకర్ అంటున్నారు. అదే విషయమై జగన్ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే కుదరటం లేదట. ప్రధాన ప్రతిపక్ష నేతతో మాట్లాడటానికి తాను ఎంత ప్రయత్నించినా ఎవరు అవకాశం ఇవ్వటం లేదని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. స్పీకర్ మాట్లాడాలని ప్రయత్నించినా జగన్ అందుబాటులోకి రాలేదంటే విడ్డూరంగానే ఉంది.

 

బహుశా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభ నడపటాన్ని స్పీకర్ నామోషీగా ఫీలవుతున్నారేమో ? పైగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు సభలో ఉంటేనే సభా నిర్వహణ ఛాలెంజింగా ఉంటుందని అంటున్నారు. నిజంగానే స్పీకర్ లో అలాంటి ఆలోచనే ఉంటే ఫిరాయింపు ఎంఎల్ఏలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ? వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోమని స్వయంగా జగనే లేఖ రాసినా స్పీకర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు. ఇక్కడే తెలుస్తోంది స్పీకర్ గా కోడెల ఎంత నిష్పక్షపాతంగా ఉన్నారో. అటువంటి సభకు తాము హాజరైతే ఎంత ? హాజరుకాకపోతే ఎంత ? అన్న లెక్కలేసుకునే వైసిపి సభ్యులు హాజరు కావటం లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: