అయిదేళ్ళ కాలానికి ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. వారి పనితీరుని చూసి తీర్పు చెబుతారు. ఏపీలో చూసుకుంటే ప్రస్తుతం అసెంబ్లీ  పదవీ కాలం మరికొద్ది రోజుల్లో ముగియబోతోంది. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో సభ్యులుగా ఉన్న వారికి ఇప్పటికైతే ఇవే చివరి సమావేశాలు.


కీలకమేనా :


ఏ ప్రభుత్వానికైనా చివరి సమావేశాలు కీలకంగా మారతాయి. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడిన తరువాత ఆ ప్రభావం సభపైన ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో ఉభయ సభలు మొదలయ్యాయి. ప్రభుత్వం రాసిన ప్రసంగం కాబట్టి బాబు సర్కార్ మీద పొగడ్తలతో పాటు కేంద్రం మీద విమర్శలు షరా మాములుగా చోటు చేసుకున్నాయి. 2029 నాటికి ఏపీని అగ్రగామిగా మారుస్తామని ప్రభుత్వ పస్ఖాన గవర్నర్ హామీ ఇచ్చారు. దాంతో తొలి రోజు సభ ముగిసింది. 


వరాల‌ వరద :


ఇక ఈ సమావేశాలో వరాల వరద పారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాబు మళ్ళీ అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలన్నీ సభలో బిల్లుల రూపంలో ముందుకు రానున్నాయి. ముఖ్యంగా కాపులకు ఈబీసీ కోటాలో ఇచ్చే అయిదు శాతం రిజర్వేషన్లు చట్ట రూపం దాల్చే బిల్లు ఈ సభలోనే రానుంది. దాంతో పాటుగా రైతు బంధు లాంటి పధకం రైతుల కోసం ఒకటి తీసుకురాబోతున్నారని ప్రచారం సాగుతోంది. 



ఇప్పటికి వరాలు కురిపించిన వర్గాలు కాకుండా మిగిలిన వారికి కూడా ఏదో సహాయం ప్రకటించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఏడు రోజుల పాటు పనిచేసే చివరి అసెంబ్లీలో ఎన్నో కీలకమైన అంశాలు, ఎన్నికల తాయిలాలు  బిల్లులుగా ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సభలో అధికార పక్షం దూకుడుగా ఉంటే, విపక్షం వైసీపీ జాడ లేకపోవడం ఓ హైలెట్ గా చూడాలి. మొత్తానికి ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ చివరి సెషన్ కూడా ముగియబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: