తెలుగుదేశంపార్టీ అనుబంధ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ పరిస్ధితి గందరగోళంలో పడినట్లు సమాచారం. పోయిన ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి నవోదయ పార్టీ తరపున గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ గెలిచారు. నవోదయ పార్టీ అభ్యర్ధిగా అనేకన్నా స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచారు అంటేనే బావుంటుంది. ఒకవైపు తెలుగుదేశంపార్టీ, మరోవైపే వైసిపి అభ్యర్ధులను ఢీకొట్టి ఆమంచి గెలిచారంటే నియోజకవర్గంపై గట్టి పట్టున్నట్లే అనుకోవాలి. అలాంటి ఆమంచి ఆ తర్వాత చంద్రబాబునాయుడు విసిరిన తాయిలాలకు ఆశపడి టిడిపి అనుబంధ సభ్యునిగా చేరిపోయారు. దాంతో ఆప్పటి నుండి ఆమంచికున్న అస్తిత్వం పోయింది.

 

ఇంతకీ ఇపుడు విషయం ఏమిటంటే, రేపటి ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేయాలా వద్దా అన్నదే పెద్ద సంసయంగా మారిందట. టిక్కెట్టు వరకూ గ్యారెంటీనే కానీ గెలుపుపైనే అనుమానంగా ఉందట. నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రంసారు ప్రభుత్వంపై ఏ స్ధాయి వ్యతిరేకత వచ్చేసిందో అందరూ చూస్తున్నదే. ఇంతటి వ్యతిరేకత నేపధ్యంలో మళ్ళీ టిడిపి తరపున పోటీ చేయాలంటే ఆమంచి ఇష్టపడటం లేదట. అలాగని ఇతర పార్టీల్లోకి వెళదామా అంటే ఎంట్రీ అంత ఈజీగా లేదట. జనసేనలో చేరేందుకు కూడా ఒకపుడు గట్టిగానే ఆమంచి మొగ్గు చూపినా తాజాగా వైసిపి వైపే చూస్తున్నారని వినికిడి.

 

అయితే, ఆమంచి ట్రాక్ రికార్డును గమనించిన జగన్ ఆమంచి విషయంలో పెద్దగా ఆసక్తి చూపటం లేదని పార్టీ వర్గాలు చెప్పాయి. జగన్ అపాయింట్మెంట్ కోసం ఆమంచి ప్రయత్నిస్తున్నా కారణాలు తెలీదు కానీ జగన్ మాత్రం పెద్ద ఇష్టపడటం లేదని సమాచారం. ఈలోగానే విషయం తెలుసుకుని ఆమంచిని పిలిపించుకుని చంద్రబాబు నిలదీశారట. దాంతో టిడిపిని వదిలేసే ఉద్దేశ్యం తనకు లేదని సర్దుబాటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో టిడిపిలో ఆమంచి ఎంత వరకూ ఉంటారన్న విషయమై చీరాలలో చర్చించుకుంటున్నారు. చూడబోతే ఆమంచి రాజకీయ భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడినట్లే కనిపిస్తోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: