సినిమాలు హిట్ అయ్యేందుకు కొన్ని టెక్నిక్కులు ఉన్నాయి. కధ లేకపోయినా. లేక లాగింగులు ఎక్కువగా ఉన్నా, ఆ సినిమాను హిట్ చేసుకునేందుకు అడిషనల్ గా ఐటెం సాంగ్స్, ఎంటర్టైన్మెంట్స్ వంటివి జోడిస్తారు. ఆ ఫార్ములాని ఇపుడు రాజకీయాల్లోనూ అమలు చేస్తున్నారా అనిపిస్తోంది. రాజకీయాలు సినిమాలు కలగలసిపోయిన వేళ సామాన్యుడి జీవితమే వినోదం అయిపోతోంది.


ఎన్నికల తాయిలాలు :


కేంద్రంలోని  మోడీ సర్కార్ పూర్తిగా ఎన్నికల తాయిలాలతో నింపేసి బడ్జెట్ తెచ్చింది. నిజానికి కేవలం నాలుగు నెలల కాలానికి జమా ఖర్చుల కోసం పెట్టాల్సిన బడ్జెట్ అది. కానీ పూర్తిగా తామే అధికారంలో ఉంటామన్న భ్రమలు కల్పిస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ మాదిరిగానే ప్రవేశపెట్టేశారు. ఇక ఈ బడ్జెట్లో రైతులతో పాటు, అన్ని వర్గాలకు వరాల జల్లు కురిపించారు. బడ్జెట్ అంటేనే జనాలకు ఒకపుడు భయం. అంటే అందులో పన్నులు బాదుడు బాగా  ఉండేది. దానికి కొద్దో గొపో .. అభివ్రుధ్ధి ఉండేది. 
కానీ ఎక్కడ పన్నులు వేస్తారో అని భయపడేవారు. ఇపుడు బడ్జెట్ అంటే ఎవరికీ ఆసక్తి లేదు. అందులో చెప్పినవి చేయరు కాబట్టి. ఇక ఎన్నికల వేళ హామీలతో నింపేసే రంగు కాగితాలే బడ్జెట్ అన్నది సామాన్యుని అభిప్రాయంగా ఉంది. మోడీ సర్కార్ మోళీ చేసి ఎలాగైనా మరో మారు గద్దె పట్టేయాలని ఈసారి ఓటాను అకౌంట్ బడ్జెట్ లో నానా రకాలైన ప్రయత్నాలు చేసినట్లుగా అర్ధమవుతోంది. దానిపైన విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 


ఇన్నాళ్ళూ చేసిందేంటో :


మరి అయిదేళ్ళ పాటు దేశాన్ని పాలించమని ప్రజలు  అధికారం కట్టబెడితే మోడీ సర్కార్ చేసిందేంటోనన్న మాట కూడా వినిపిస్తోంది. పుణ్య కాలం పూర్తి అయ్యాక మోడీ సర్కార్ తాపీగా ఆకులు పట్టుకునే ప్రయత్నమే ఈ బడ్జెట్ అని అంటున్నారు. ఇక వరాలు, హామీలు కురిపించి ఓట్లు రాబట్టుకునే విధానం కూడా ఈ బడ్జెట్లో కనిపించిందని కూడా చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా అసలు ఈ పరిస్థితి మోడీకి ఎందుకు వచ్చిందన్నది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. నిజంగా తన పరిపాలన బాగుంటే దాన్ని చూపించి ఓట్లు అడగాల్సిన డిల్లీ పెద్దలు ఇపుడు హదావుడిగా తాయిలాల మూట విప్పాల్సిన గతి ఎందుకు పట్టిందని కూదా నిగ్గదీస్తున్నారు. అంటే పాలన సరిగా చేయలేదని డిల్లీ ప్రభువులే పరోక్షంగా అంగీకరిస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. అందువల్లనే చివరి నిముషంలో ఈ డెకరేషన్ చేయాల్సి వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.


ఇక్కడా అంతేగా...:


ఇక ఏపీలో చూసుకున్నా ఏమంతా  గొప్పగా పాలన లేదని బాబు గారు ఒప్పుకుంటున్నారు. అందువల్లనే కొత్త ఏడాది వస్తూనే సామాజిక పించన్లు పెంచేశారు. అంతే కాదు. రైతులకు తొమ్మిది గంటల కరెంట్ అన్నారు,  ఇపుడు రైతులకు ఎకరా పదివేలు నగదు  అంటున్నారు. డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయల చెక్కులు, నిరుద్యోగులకు రెండు వేల భ్రుతి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. బీసీలకు కులానికో కార్పోరేషన్, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇలా చాలా ఉన్నాయి. ఇక ఏపీ బడ్జెట్ ముచ్చట ఇంకా రాలేదు. అది ప్రవేశపెడితే బాబు గారు సర్కార్ తెచ్చిన గంపలో ఎన్ని వరాల మూటలు ఉంటాయో మరి.


పాలన లేదుగా :


అంటే అయిదేళ్లలో తాము సరిగా పాలన చేయలేకపోయామని అటు మోడీ, ఇటు బాబు ఇండైరెక్ట్ గా ఒప్పేసుకున్నట్లే కదా. తమ పాలన బాగుంటే దాన్ని చూసి ఓటు వేయమని ఎందుకు చెప్పలేకపోతున్న్నారు. ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని ఈ తాయిలాల తమాషా ఏంటి. రైతులు, ఇతర వర్గాలు అపుడు కూడా ఉన్నాయి కదా తమకు పెద్ద మనసు ఉంటే నాడే వాటిని ఎందుకు అమలు చేయలేకపోయారు. ఎన్నికల ముందు ఇలా ప్రజాధనం ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునే దుష్ట సంప్రదాయాన్ని రాజకీయ నాయకులు కొనసాగించడం దారుణం. నిజంగా ప్రజలు తెలివైన వారు అయితే అయిదేళ్ల పాలనను చూసి ఓటు వేయాలి. అంతే తప్ప ఎన్నికల ముందు తాయిలాలను చూసి కాదు. అలాగైతే ఇకపై ప్రతీ వారూ కూడా అయిదేళ్ళూ తమకు నచ్చినట్లుగా పాలన చేసి ఎన్నికల ముందే వరాలతో వస్తారు. ఓటరు మహాశయా.. తస్మాత్ జాగ్రత్త 


మరింత సమాచారం తెలుసుకోండి: