ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఫిరాయింపుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే కొందరు ఫిరాయింపులకు టిక్కెట్లు దక్కవనే స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. తాజాగా కర్నూలు ఎంపితో పాటు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డికి మొండిచెయ్యి తప్పదనే అర్ధమవుతోంది. ఎస్వీ టిక్కెట్టుకు కెఇ సోదరులు అడ్డుపడుతున్నారట. ఎస్వీ టిక్కెట్టుకు కెఇ సోదరులు అడ్డుపడకపోతే డోన్ లో కెఇ ప్రభాకర్ టిక్కెట్టుకే ఎసరు ఖాయంగా కనిపిస్తోంది. అందుకే సోదరులు చంద్రబాబు దగ్గర చురుగ్గా పావులు కదుపుతున్నారట.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున కర్నూలు ఎంపిగా కోట్ల సూర్యప్రకాశరెడ్డి పోటీ దాదాపు ఖాయమే. ఎంపి సీటుతో పాటు రెండు అసెంబ్లీలు అంటే డోన్, ఆలూరు కూడా కోట్ల అడుగుతున్నారు. డోన్ లో భార్య సుజాతమ్మ, ఆలూరులో కొడుకు పోటీ చేస్తారని కోట్ల ఇప్పటికే చంద్రబాబు ముందు ప్యాకేజి డిమాండ్ పెట్టారట. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కోట్ల కుటుంబం టిడిపిలో చేరికకు రంగం రెడిగా ఉంది.

 

ఈ సమయంలోనే కెఇ కృష్ణమూర్తి, కెఇ ప్రభాకర్ అప్రమత్తమయ్యారట. కోట్ల కోరుతున్న డోన్ స్ధానంలో పోయిన ఎన్నికల్లో కెఇ ప్రభాకర్ పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయటానికి రెడీ అవుతున్నారు. ఇటువంటి సమయంలోనే టిడిపిలోకి కోట్ల ఎంట్రీకి రంగం సిద్ధమైంది. చంద్రబాబు గనుక కోట్ల డిమాండ్లకు ఓకే అంటే డోన్ లో ప్రభాకర్  కు మొండిచెయ్యే. అందుకనే కెఇ సోదరులు అప్రమత్తమై ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డికి బదులు సుజాతమ్మకు కర్నూలు ఎంఎల్ఏగా సీటు కేటాయిస్తే బాగుంటుందని చెప్పారట. మరి చంద్రబాబు ఏమంటారో తెలీదు కానీ ఎస్వీ మోహన్ రెడ్డిలో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: