అన్న నందమూరి తారక రామారావు సినిమా రంగంలో మకుటం లేని మహారాజు. అక్కడ ఆయనకు విజయాలే తప్ప అపజయాలు ఎరగని నైజం. ఇక రాజకీయాల్లో అయితే ఎన్టీఆర్ వస్తూనే సెన్సేషనల్ విక్టరీ క్రియేట్ చేశారు. అయితే ఆయన పదనాలుగేళ్ల రాజకీయ జీవితం అంతా గెలుపు ఓటముల సమాహారంగా సాగింది.


జనంతోనే...:


అయితే ఎన్టీఆర్ జనం చేతిలో ఎపుడూ ఓడిపోలేదు. 1989లో ఆయన ఘోర పరాజయం పాలు అయినా అది పార్టీలో కుమ్ములాటలు, అల్లుళ్ళు ఇద్దరు కలసి చేసిన వ్యతిరేక కార్యకలాపాలు తప్ప జనం మాత్రం ఆయన్ని దూరం పెట్టలేదు. ఇక మళ్ళీ 1994లో ఎన్టీఆర్ తిరిగి పుంజుకుని లాండ్ మార్క్ విక్టరీని కొట్టి అందరి నోళ్ళకు సమాధానం చెప్పారు. ఇక ఎన్టీఆర్ బతికి ఉంటే 1995 వెన్నుపోటుకు కూడా తనదైన శైలిలో బదులు తీర్చుకునేవారన్నది అందరి మాట. 


కోట్లకు ఝలక్ :


ఇవన్నీ ఇలా ఉంచితే ఎన్టీఆర్ 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేసినపుడు జనాలకు తనదైన హామీలను ఇచ్చారు. అందులో కీలకమైనది కిలో రెండు రూపాయాలకు బియ్యం పధకం. అయితే ఈ పధకాన్ని అప్పట్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కాపీ కొట్టేశారు. అంతే కాదు. కిలో రూపాయి తొంబయి పైసలకే ఇచ్చేశారు కూడా అయితే జనం మాత్రం కాంగ్రెస్ తో విసిగిపోయి ఉన్నారు కాబట్టి నమ్మలేదు. దాంతో ఎన్టీఆర్ బంపర్ మెజారిటీతో గెలిచారు.


ఇపుడూ అంతెనా..:


ఏపీలో ఇపుడు మళ్లీ 1982 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పట్లో మాదిరిగానే ఇపుడు అధికారంలో ఉన్న చంద్రబాబు జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలను పూర్తిగా కాపీ కొట్టేస్తున్నారు. దాని మీద ఫెయిర్ అయిన జగన్ కడప మీటింగులో నాటి ఎన్టీఆర్ పోలిక తీసుకువచ్చే ఈ సంఘటన చెప్పారు. పధకాలు ఎవరు ప్రకటించారన్నది జనం చూస్తారని, పైగా చివరి నిముషంలో చేసిన పనులకు ఓట్లు రాలిన చరిత్ర లేదని కూడా జగన్ తేల్చేశారు. 


కడుపు మాడ్చి మరీ...!


57 నెలల పాటు కడుపు మాడ్చి ఇపుడు పరమాన్నం పెడతామంటే నమ్మే వారు లేరని జగన్ అన్నారు. నిజంగా చంద్రబాబునాయుడుకే ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే ఆయన తన పరిపాలనలో ఇంతకు ముందే ఈ పనులు ఎందుకు చేయలేకపోయారని జగన్ వాలీడ్ ప్రశ్న ఒకటి సంధించారు. 1982లో ఎన్టీఆర్ కి జరిగినట్లుగానే తనని జనం ఎన్నుకుంటారని, కోట్ల మాదిరిగా బాబుకు పరాభవం తప్పదని కూడా జగన్ జోస్యం చెప్పేశారు. మరి అదే నిజమవుతుందా..


మరింత సమాచారం తెలుసుకోండి: