రాజకీయాలు ఎంతలా భ్రష్టుపట్టిపోతున్నాయో ఈనాడు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఓ దేశ  ప్రధాని రాష్ట్రానికి వస్తానంటే గో బ్యాక్ అనడం. ఇదేం విధానం. నిన్నటికి నిన్న కేంద్ర పరిశోధనా సంస్థ సీబీఐ అధికారులను ముద్దాయిల్లా కోల్ కటా పోలీసులు అడ్డుకున్నారు. ఆ పైన అక్కడి సీఎం మమత రోడ్డు మీదకు వచ్చి కధను మొత్తం రక్తి కట్టించారు. దేశంలో ఇరవై తొమ్మిది రాష్టాలు, అన్నిటికి అధిపతి ప్రధాని. ఆయన ఓ రాష్ట్రానికి వస్తానంటే వద్దనే హక్కు ఎవరికి ఉంది.


ఇదేనా రాజకీయం :


రాజకీయాలంటే సిధ్ధాంతాలు, విధానాలు ఉండాలి. అవి లేని నాడు తిట్ల పురాణం బయటకు వస్తుంది. అసహనం పెచ్చరిల్లుతుంది. ఏపీలో అదే జరుగుతోంది. ప్రధాని మోడీని ఏపీకి రావద్దు, గో బ్యాక్ అని నినాదాలు ఇవ్వడం, దారుణంగా ఆయన్ని కించపరుస్తూ హోర్డింగులు పెట్టడం తగునా. అవునన్నా కాదన్నా ఆయన ఈ దేశానికి ప్రధాని. ఆయన ఏపీకి ఏమీ చేయలేకపోవచ్చు. అయినప్పటికీ ఆయన్ని అడ్డుకుంటామనడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం. ఈ దేశంలో అందరికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉంది. ఎవరైన ఏమైనా చెప్పుకోవచ్చు. ప్రధాని ఏపీకి వచ్చి ప్రసంగాలు చేసుకోవచ్చు. ఆయన పార్టీ బీజేపీ తరఫున ఓట్లు అడగవచ్చు. జనం నచ్చితే వింటారు ఓట్లు వేస్తారు. లేకపోతే లేదు కానీ మధ్యలో ఆయన రావద్దే వద్దు అనడం టీడీపీకి తగునా, ఇదేనా ప్రజాస్వామ్య పరిరక్షణ.


లాంచనాలు మరచి :


ప్రధాని వంటి వ్యక్తి ఓ రాష్టానికి వస్తే ఎన్ని విభేదాలు ఉన్నా స్వాగతం పలకడం ముఖ్యమంత్రి ధర్మం. గతంలో కాగ్రెస్ పార్టీతో ఎన్ని గొడవలు ఉన్నా  టీడీపీ తరఫునే సీఎం గా ఉన్న అన్న నందమూరి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి వచ్చినపుడు ఎదురేగి స్వాగతం పలికిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదంతా మనం వ్యవస్థలకు ఇస్తున్న గౌరవం . అక్కడ మోడీ కాదు, ఈ దేశ ప్రధాని అన్నది గుర్తు పెట్టుకోవాలి. చిల్లర రాజకీయం చేసి పదవులకు ఉన్న విలువలు తీసెస్తే మళ్ళీ మనమే  తేలిక అవుతాం. వాటి ఔన్నత్యాన్ని తిరిగి  నిలబెట్టుకోవాలంటే తాతలు దిగి రావాలి.


చిన్న రాష్ట్రం మాత్రమే :


ఏపీ ఈ దేశంలో ఓ చిన్న రాష్ట్రం మాత్రమే. కేవలం 13 జిల్లాల రాష్ట్రం. దేశంలో 600 పైగా జిల్లాలు ఉన్నాయి వాటికి అధిపతి ప్రధాని. అటువంటి నాయకుడు ఏపీకి వస్తానంటే  రావద్దు అనేది పూర్తిగా తప్పుడు విధానమే. నిజానికి ఈనాడు మోడీని వద్దు అంటున్న వారు ఒకనాడు ఆయన్ని నెత్తిన పెట్టుకున్న వారీ కావడం విశేషం. మోడీ వస్తే ఎందుకు అంత ఉలుకు అన్నది కూడా ఇక్కడ చర్చకు వస్తోంది. ఈ విషయంలో జనంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ కానీ మరే పక్షాలు, సంఘాలు కానీ అతి చేస్తే చివరికి అది వారికే  బూమరాంగ్ అవుతుంది. బీజేపీకి లేని పోని సింపతీ కూడా క్రియేట్ చేసిన వారు కూడా అవుతారు.



మరింత సమాచారం తెలుసుకోండి: