ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా ఇపుడు అధికార విపక్షాలు సై అంటే సై అంటున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ మరో ఐదేళ్ళ పాటు అధికారం కోరుకుంటూంటే, ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని వైసీపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఈ నేపధ్యంలో గతంలో ఎన్నడూ చూడని సీన్లు ఏపీలో కనిపిస్తున్నాయి.


ఆదరాబాదరాగా :


తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏపీలో ఐదు ఎకరాలు ఉన్న రైతులకు కేంద్రం ఇఛ్చే ఆరు వేలకు తోడు మరో నాలుగు వేల రూపాయలు జత చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. కేంద్రం స్కీమ్ లో కవర్ కాని వారికి మాత్రం పది వేల రూపాయలు నేరుగా ఇస్తామని ప్రకటించారు. కానీ ఈ నిర్ణయం తీసుకుని వారం రోజులు కూడా తిరక్కుండానే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏపీ సర్కారు ఇఛ్చేది నాలుగు వేలు కాదు..తొమ్మిది వేల రూపాయలు అని ప్రకటించారు.


అంటే అదనంగా మరో ఐదు వేల రూపాయలు జత చేశారు. వారం రోజుల్లోనే ఎందుకు చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని కాదని..మాట మాత్రంగా చంద్రబాబు ఎందుకు మళ్ళీ రైతుకు చెల్లించే మొత్తంలో మార్పులు చేశారు?. అంటే రైతులు చంద్రబాబు నమ్మటం లేదనే సంకేతాలు వచ్చాయా? దానికి తోడు అన్నట్లుగా కొంత మొత్తం ఇవాళా రేపట్లో రైతుల ఖాతాలో నేరుగా వేసేయాలని బాబు సర్కార్ హడావుడిగా నిర్ణయం తీసుకునిద్, అందుబాటులో ఉన్న మంత్రులతో ఆమోదం తీసుకుని అప్పటికపుడు ఓ జీవోను రిలీజ్ చేశారు.


నమ్మటంలేదా :


బాబు ఇప్పటివరకూ ప్రకటించిన అనేక పధకాలను ఆయా వర్గాల లబ్దిదారులు నమ్మటంలేదా. ఈ సందేహాలు ఎవరికో రావడం కాదు. ఏకంగా ఏలిన వారికే వస్తున్నాయి. అందుకే చివరి నిముషం వరకూఅ అదే పనిగా కొత్త జీవోలు తెచ్చేస్తున్నారు. ఎకాఎకీన రైతుల ఖాతాలోకి డబ్బులు పంపించేస్తున్నారు. నిజానికి రైతులకు రుణ మాఫీ పధకం సవ్యంగా చేసి ఉంటే ఈ కొత్త పధకాలు అవసరం లేదు సరి కదా, అపుడు రైతులకు పూర్తి నమ్మకం టీడీపీ మీద పెరిగేదని అంటున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణాలు పూర్తిగా తీరిస్తే ఈ పసుపు కుంకుమా స్కీములు అవసరం లేదు కదా అని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ  బాబులో మాత్రం ఎక్కడలేని టెన్షన్ పెరిగిపోతోంది. క్షణక్షణానికి పధకాలు, జీవోలు అంటూ పడుతున్న కంగారు ఇదే రుజువు చేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: