రాజకీయాల్లో నిజం అయ్యేంతవరకూ ప్రతీదీ పుకారే. అలాగనీ పుకారుని సైతం తేలిగ్గా కొట్టి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే  అది ఫక్త్ రాజకీయం ఏదైనా  జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్న రంగం. మరి రాజకీయాల్లో ఉన్న వారి మీద పుకార్లు అందుకే ఇట్టే పుడతాయి. విషయానికి వస్తే ఏపీలో ఓ కొత్త పుకారు మళ్ళీ మొదలైంది.


పవన్ తో బాబు :


ఇది 2014 నాటి ముచ్చట. ఆనాడు ఏకంగా మాజీ సీఎం గా తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఏపీని పాలించి, జాతీయ స్థాయిలో ఎన్నో మార్లు చక్రం తిప్పి దశాబ్దాల అనుభవం కలిగిన చంద్రబాబు లాంటి నాయకుడు హఠాత్తుగా  పవన్  ఇంటికి వెళ్ళారు. ఇది నిజంగా  షాకింగ్ పరిణామం. ఆ తరువాత జరిగింది అందరికీ తెలిసిందే. పవన్ తన జనసేన పార్టీని పోటీ నుంచి తప్పించి మరీ బాబుకు ఉపకారం చేశారు. టీడీపీ గెలుపులో ఎంత కాదన్నా పవన్ పాత్ర చాలా కీలకం ఓ విధంగా చెప్పాలంటే తులసీదళం లాంటి బరువైన తూకాన్ని వేసి మరీ పవన్ బాబుకు  ఎన్నికల్లో  మొగ్గు వచ్చేలా చేశారు.  మరి సీన్ కట్ చేస్తే  ఇపుడు ఈ ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్ధులుగా ఉన్నారు. ఎన్నికల వేళ కలుస్తారంటూ పుకార్లు వస్తున్నాయి.


అది నిజమేనా :


ఏపీలో ఇపుడు టీడీపీ పరిస్థితి ఏమంత బాగాలేదు.  ఆ పార్టీ వైపు నుండి వరసగా గోడ  దూకుళ్ళు షురూ అయిపోయాయి. బాబు పార్టీ ఇక గెలవదు అంటున్నారు వైసీపీలో చేరిన నిన్నటి టీడీపీ తమ్ముళ్ళు. మరో వైపు జగన్ ఆద్వర్యంలో బీసీ గర్జన సభ రీ సౌండ్ తో ఏపీ పాలిటిక్స్  సీన్ కూడా మారిపోయింది. జగన్ గెలుపు ఖాయమని ఇప్పటికైతే అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. మరి వ్యూహాలను రచించడంలో సమర్ధుడైన బాబు ఇపుడేం చేస్తారు.


పవన్ తో దోస్తీకి మళ్ళీ తలుపు తడతారా. ఇదే ఇపుడు ఏపీలో జరుగుతున్న ప్రచారం. మరి దానికి పవన్ ఏమంటారు. బాబు వైపు నుంచి పవన్ తో స్నేహం కోసం చాలా రోజులుగా పిలుపులు వస్తున్నాయి. పవన్ చూస్తే ఈ మధ్య మరీ సైలెంట్ అయ్యారు. మరి ఇది దేనికి సంకేతం అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. పవన్ బాబు దోస్తీ కట్టి మరో మారు ఎన్నికల్లో పోటీ చేస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏమో అది నిజం అవచ్చు, కాకనూ పోవచ్చూ. ఎంతైనా రాజకీయ రంగమిది. దేన్ని కొట్టివేయలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: