వైఎస్ జగన్ పదేళ్ళ క్రితం ముందు ఆయన పెద్దగా ఎవరికీ తెలియదు. 2008లో సాక్షి పేపర్ ప్రారంభంలో మాత్రం ఆయన ఒకసారి  జనాల కంట పడ్డారు. ఇక 2009 ఎన్నికల్లో ఎంపీగా ఆయన కడప నుంచి నెగ్గారు. అంతవరకే ఆయన పరిమితమయ్యారు. మరో వైపు వైఎస్సార్ ప్రభంజనం అలా సాగిపోతున్న రోజులవి. మరి ఆయన కుమారుడుగా జగన్ కేవలం వైఎస్ కేరాఫ్ గానే ఉండేవారు.


బలమైన శక్తిగా :


ఇక ఏపీలో 2009 తరువాత వైఎస్సార్ దారుణంగా హెలికాప్టర్  ప్రమాదంలో మరణించడంతో జగన్ లోకానికి  అపుడే బాగా తెలిశారు.  నాటి నుంచి రాజకీయంగా ఎదుగుతూ వచ్చిన జగన్ 2014 ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని చేజార్చుకున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ కి ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఖాయమని , ఆయనే తదుపరి సీఎం అని అన్ని రకాల సర్వేలు వెల్లడి  అవుతున్న తరుణంలో జగన్ కి పదవుల మాట ఎలా ఉన్న బిరుదులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు రోజుకొక బిరుదు ఇస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు క్యాడర్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.


నేరస్తుడట ;


జగన్ కి చంద్రబాబు తాజాగా ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా. నేరస్తుడు. జగన్ చేసే అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావుట. ఆయన పార్టీ ఎంతటికైనా దిగజారిపోతుందంట. దౌర్జన్యాలకు, దోపీడీలకు కేరాఫ్ అడ్రస్ జగన్. ఆయనతో జర జాగ్రత్త అంటూ కేడర్ కి బాబు అలెర్ట్ చేస్తున్నారు. బాగానే ఉంది కానీ జగన్ తో పాటు ఆయన కుటుంబాన్ని మొత్తం చంద్రబాబు ఇలా లాగడమే ఇక్కడ విషాదం. జగన్ రాజకీయ నాయకుడు అయ్యాక ఎవరు పడనన్ని  విమర్శలు, తిట్లు తింటూనే వచ్చారు. 


మరి అటువంటిది జగన్ ని నేరస్థుడని ఘోరమైన తీర్పు ఇచ్చేసిన చంద్రబాబు ఆయన కుటుంబం కూడా ఇంతేనంటూ ఆడిపోసుకోవడంపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ని నానా మాటలు అంటున్న బాబుకు ఆయన నామస్మరణ చేయకపోతే తెల్లారదని కూడా విమర్శిస్తున్నారు. మొత్తానికి జగన్ కొత్త బిరుదు నేరస్తుడు. దీంతోనే రేపు ఎన్నికల ప్రచారంలోకి బాబు వెళ్లనున్నారేమో. ఓ నేరస్థుడికి  ఓటేస్తారా అని జనాన్ని నిలదీసేలా ఉన్నారు. మరి 2014లోనే ఈ పాత చింతకాయ కబుర్లు విని విని విసిపోయిన జనాలు ఈ కొత్త బిరుదుని పట్టించుకుంటారా.. మొత్తానికి జగన్ మీద బాబు గారి ఉక్రోషం, అక్కసు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అవి దేనికి సంకేతమో మరి.
    


మరింత సమాచారం తెలుసుకోండి: