అవును అలాగే ఉంది పరిస్ధితులు చూస్తుంటే. ఒకసారి చరిత్రలోకి తొంగిచూస్తే 1999 ఎన్నికలు జరిగాయి. పోలింగ్ అయిపోయిన తర్వాత ఇంకేముంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎం అయిపోయినట్లే అనుకున్నారు అందరూ. కాంగ్రెస్ నేతలైతే సంబరాలు కూడా చేసేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు వైఎస్ ముహూర్తం కూడా చూసుకున్నారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు వచ్చి బొకేలిచ్చి అభినందనలు కూడా చెప్పి వెళ్ళారు. టిడిపి నేతల మొహాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్క కూడా లేదు.

 Image result for ysr padayatra pics

సరే కౌంటింగ్ మొదలైంది. ఓట్ల లెక్కింపు రౌండ్లు ముందుకు జరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతలకు ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు. కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికి టిడిపినే మళ్ళీ అధికారంలోకి వచ్చిందని అర్ధమైపోయింది. ఒకరకంగా వైఎస్ కు ఆ ఫలితం పెద్ద షాకనే చెప్పాలి. తర్వాత ఐదేళ్ళు గిర్రున జరిగిపోయింది. పార్టీలో పరిస్ధితులు కూడా వైఎస్ కు ఎదురు తిరిగాయి. దాంతో అస్తిత్వం నిలుపుకునేందుకు వైఎస్ పాదయాత్ర మొదలుపెట్టారు. అప్పటికే చంద్రబాబు మీద కూడా జనాల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది.

 Image result for ysr swearing ceremony 2004

అదే సమయంలో చంద్రబాబు మీద అలిపిరిలో మావోయిస్టులు హత్యాయత్నం చేశారు. ఒకవైపు జనాల్లో వ్యతిరేకత, మరోవైపు వైఎస్ పాదయాత్ర, అదే సమయంలో సిఎంపై హత్యాయత్నం. వెరసి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. పోలింగ్ జరిగింది. మూడోసారి కూడా చంద్రబాబే సిఎం అనుకున్నారు. కౌంటింగ్ మొదలైన తర్వాత చూస్తే టిడిపి నేతలకు పెద్ద షాక్. మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, వైఎస్ సిఎంగా బాధ్యతలు తీసుకోవటం అన్నీ చకచక జరిగిపోయాయి.

 Image result for ys jagan padayatra

సీన్ కట్ చేస్తే 2014 లో రాష్ట్ర విభజన జరిగింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డే సిఎం అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ మొదలైంది. అధికారంలోకి వస్తామని టిడిపి నేతల్లో ఏ కోశానా నమ్మకం లేదు. కానీ కౌంటింగ్ పూర్తయ్యేసరికి చంద్రబాబు సిఎం అయిపోయారు. మోడి, పవన్ మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండేదో ? అధికారాన్ని జగన్ తృటిలో మిస్సయ్యారు. నిజంగా అప్పట్లో జగన్ కు అది పెద్ద షాక్ అనే చెప్పాలి.

 Image result for ys jagan padayatra

చూస్తుండగానే ఐదేళ్ళు సర్రున తిరిగిపోయాయి. టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ పాదయాత్ర చేశారు. అప్పట్లానే ఇపుడు కూడా చంద్రబాబుపై జనాల్లోని వ్యతిరేకత బయటపడుతోంది. పైగా విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం. వెరసి చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్. అప్పట్లో కూడా పాదయాత్ర తర్వాతే వైఎస్ సిఎం అయ్యారు. మరి ఇపుడు జగన్ కూడా పాదయాత్రను పూర్తిచేశారు. మరి రేపటి ఎన్నికల్లో ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే ?


మరింత సమాచారం తెలుసుకోండి: