రాజకీయాల్లో ఉన్న వారికి ఒక్కో సారికి దారులు సరిగ్గా తెలియవు. అయోమయం అంతటా కనిపిస్తుంది  అంతవరకూ ఎదురులేదనుకున్న చోటనే అన్నీ ఎదురుదెబ్బలే తగులుతాయి. ఒంటి చేత్తో రాజకీయం చేసిన వారికే ఎక్కడ లేని కష్టాలు వచ్చేస్తాయి. చక్రం తిప్పిన వారే కాలచక్రం మహిమకు వెనక్కి వెళ్ళిపోతారు. 


మాజీలకు రూట్ క్లియర్ :


ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే ఇద్దరు మాజీ మంత్రులకు రూట్ క్లియర్ అయింది ఈ ఇద్దరూ  దశాబ్దాల పాటు రాజకీయం చేస్తూ వచ్చిన వారే. ఇద్దరిదీ ఒకటే ప్రాంతం. ఒకరు దాడి వీరభద్రరావు అయితే, రెండవ వారు కొణతాల రామక్రిష్ణ. ఈ ఇద్దరూ గత అయిదేళ్ళుగా ఏ పార్టీకి చెందకుండా ఉన్నారు. వారిని తమవైపునకు తిప్పుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. అయితే ఎందుకో కుదరలేదు. ఇపుడు ఎన్నికలు వస్తున్నాయి. దాంతో తప్పనిసరిగా ఈ ఇద్దరు నాయకులు తమ దారులేవో కనుక్కున్నారు. 


టీడీపీలోకి కొణతాల :


కొణతాల రామక్రిష్ణ కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన నాయకుడు. ఆయన ముప్పయ్యేళ్ళ రాజకీయ జీవితం మొత్తం అలాగే గడచింది. టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించే కొణతాల ఆ పార్టీలోకి చేరుతారని ఎవరూ అనుకోలేదు. కొణతాల కూడా అలా వూహించలేదు. అయితే రాజకీయాలంటే అంతే. ఇపుడు తప్పని పరిస్తితుల్లో ఆయన సైకిలెక్కబోతున్నారు. నిన్న అమరావతి వెళ్లి చంద్రబాబుని కలసి వచ్చిన కొణతాల రేపో మాపో పసుపు కండువా కప్పుకోనున్నారు. ఆయన అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా రంగంలో ఉంటారని అంటున్నారు.


దాడి ఇటువైపు :


ఇక కొణతాలతో రాజకీయ వైరం పూర్తిగా కలిగి ఉన్న మరో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు తన అభిమానులు , అనుచరులతో మీటింగు పెట్టిన దాడి వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చిందని, తాను అందులోకి వెళ్ళిపోతున్నానని చెప్పుకొచ్చారు. దాడి వైసీపీ తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. గతంలో పలు మార్లు ఇదే నియోజకవర్గం నుంచి పలు మార్లు పోటీ చేసిన దాడి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. మొత్తానికి చూసుకుంటే ఈ ఇద్దరు మాజీ మంత్రులు చెరో రాజకీయ పార్టీని ఎంచుకుని మళ్ళీ రాజకీయ ప్రత్యర్ధులుగా మారుతున్నారు. వీరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: