ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది ఒక బాధ కాదు, ఒక ఆందోళన కాదు. ఆయన పరిపాలన మరచిపోయి చాలాకాలమైంది ఆయన జాతీయ నాయకుడు అయిపొయారు. డిల్లీ వెళ్ళి విపక్షాలతో కలసి మీడియా మీటింగులు పెడతారు. అమరావతి వచ్చి మళ్ళీ మోడీని తిడతారు. ఆయన ఏ సభలో ఉన్నా మోడీ, జగన్, కేసీయార్ ల గురించి తలచుకోకుండా ప్రసంగం చేయలేకపొతున్నారు.  ఆయన నెగిటివిటీతో అన్నీ అలాగే చూస్తున్నారు. లేటెస్ట్ గా విశాఖ జోన్ విషయంలోనూ అంతే.


ఎందుకు గోల :


నిజానికి విశాఖ రైల్వే జోన్ అన్నది దశాబ్దాల కల. ఏపీ సీఎం చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా ఉండగా విశాఖ రైల్వే  జోన్ కోసం ఏమీ చేయలేకపోయారు. అంతే కాదు. అప్పట్లో సౌత్ సెంట్రల్ జోన్లో ఉన్న వాల్తేర్ డివిజన్ని అప్పటి ప్రధాని దేవేగౌడా హటాత్తుగా  తూర్పు కొస్తా జోన్లోకి తోసెస్తే బాబు కనీసం ఏమీ చేయలేకపోయరు. ఈ ముచ్చట జరిగినపుడు బాబు యునైటెడ్ ఫ్రంట్ లో ఉండి చక్రం తిప్పుతున్నారు. ఇక ఉత్తరాంధ్రా నుంచి ఎంపీగా ఉన్న కింజరపు ఎర్రన్నాయుడు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన సైతం తన ప్రాంతానికి  జోన్ తెప్పించుకోలేకపోయారు. ఇక కేంద్రంలో బీజేపీ, ఏపీలో చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. అయినా నాలుగేళ్ల పాటు బీజేపీతో ఉన్న బాబు విశాఖకు జోన్ తీసుకురాలేకపోయారు.


నష్టం ఎవరికి :


రెండు రోజుల క్రితం కేంద్రంలోని మోడీ సర్కార్ విశాఖకు రైల్వే జోన్ ప్రకటించింది. కొత్త జోన్ ప్రకటిస్తే డివిజన్లు ఆకాశంలో నుంచి వూడిపడవు, పాత డివిజన్లనే విభజించి ఏర్పాటు చేయాలి. అలా తూర్పు కోస్తాలో ఉన్న వాల్తేర్ డివిజన్ని రెండు భాగాలు చేసి తూర్పు కోస్తాకు కొత్త డివిజన్ గా రాయగడను ప్రకటించారు. మరో భాగాన్ని విజయవాడ డివిజన్లో కలిపారు. ఆ విధంగా గుంతకల్లు, గుంటూర్, విజయవాడ జోన్లను సౌత్ సెంట్రల్ జోన్లో నుంచి విడదీసి ఏపీ కొత్త జోన్లో కలిపారు. ఇదంతా భారతీయ రైల్వే దేశాన్ని అంతా ఓ యూనిట్ గా తీసుకుని చేసిన విభజన ప్రక్రియ. రాష్ట్రాలతో వారికి సంబంధం ఉండదు. ఏక మొత్తంగా భారతీయ రైల్వే  జోన్లకు ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా రాష్ట్రాలకు ఒక జోన్ అంటే ఈ దేశంలో 29 జోన్లు ఉండాలి. కానీ ఇప్పటికి కొత్త జోన్ తో కలుపుకుని 18 వరకే ఉన్నాయి. ఇక జోన్ల వల్ల లాభనష్టాలన్నీ రాష్ట్రాలకు చెందవు. రైల్వే శాఖకే వెళ్ళిపోతాయి. అందువల్ల వాళ్లకు లాభం, వీళ్లకు నష్టం అన్నది సంకుచితమైన విమర్శలుగానే చూడాలి.


అప్పట్లోనే వచ్చేది ;


నిజానికి విశాఖ రైల్వే జోన్ రెండేళ్ల పాటు వెన‌కకు పోవడానికి టీడీపీయే కారణమని కమలనాధులు అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని 2016లో కేంద్రం అనుకుంటే విజయవాడ కావాలని గోల చేసింది అప్పట్లో టీడీపీ ఎంపీలేనని గుర్తు చేశారు. ఇక వాల్తేర్ ని విడగొట్టి జోన్ ఇస్తారని కూడా టీడీపీ వారికి తెలుసని కూడా అంటున్నారు. కేవలం రాజ‌కీయ కారణాలతోనే బాబు విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అంటున్నారు.


పొలిటికల్ స్టంట్  :


నిజానికి రైల్వే జోన్ ప్రకటనతో బీజేపీకి కొంత మైలేజ్ వచ్చింది. అది రాకుండా ఇపుడు టీడీపీ ఈ కామెంట్స్ చేస్తోందని అంటున్నారు. నిజానికి జోన్ విషయంలో ఇన్నాళ్ళు టీడీపీ కేంద్రాన్ని ఎందుకు వత్తిడి చేయలేదని అని కూడా అంటున్నారు.  బాబు అన్నదే నిజమైతే  ఏకంగా మూడు డివిజన్లు సౌత్ సెంట్రల్ నుంచి కోల్పోయినందుకు తెలంగాణా సీఎం కేసీయార్ మ‌రెంత యాగీ చేయాలని కూడా గుర్తు చేస్తున్నారు. కానీ కేసీయార్ గమ్ముంటే బాబు మాత్రం రంకెలు వేయడం పొలిటికల్ స్టంట్ అంటున్నారు. మొత్తానికి జోన్ రావడం ప్రజలకు ఆనందకరమైతే తన రాజకీయం పోయిందన్నది బాబు బాధగా ఉందని సెటైర్లు పడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: