దేవుడు ప్రాణం పోస్తాడు.. డాక్టర్ ప్రాణం నిలబెడతాడు అని అంటారు కానీ.. ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తుంటే.. ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతుంటే.. ఆస్ప‌త్రిలు ప్రాణాల‌ను బ‌లిగొనే ప్రాంతాలుగా మారితే.. అదే నిర్ల‌క్ష్యం మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తుంటే.. అదే జ‌రుగుతోంది హైద‌రాబాద్‌లో. హైదరాబాద్‌లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఘోర‌మైన మాన‌వ త‌ప్పిదం జ‌రిగింది. నీలోఫర్‌లో వ్యాక్సిన్‌ బాధిత చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. పారాసిటమాల్‌కు బదులు ట్రెమడాల్ మెడిసిన్ ఇవ్వడంతో నిన్న ఓ బాలుడు మృతిచెందగా.. ఇప్పటికి 34 మంది చిన్నారులు అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 


శిశువులకు టీకాలు వేసిన తర్వాత మాత్రలు ఇవ్వడంలో సిబ్బంది చేసిన పొరపాటే ఈ ఘోరానికి దారితీసింది. నాంపల్లి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో 6 నెలల్లోపు వయసున్న 92 మంది శిశువులకు డిప్తీరియా, హెపటైటిస-బి, హిమోఫీలియా, కోరింత దగ్గు, టెటనస్‌ రాకుండా ఉండేందుకు పెంటావాలెంట్‌ టీకాలను వేశారు. ఆ టీకాలు వేశాక చిన్నారులకు సాధారణంగా జ్వరం వస్తుంది. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్‌ సిరప్‌ ఇవ్వాల్సి ఉండగా.. ట్రెమడాల్‌ 75 ఎంజీ మాత్రలు ఇచ్చారు. ఈ ఓవర్‌ డోస్‌ చిన్నారులకు ప్రాణాంతకమైంది.  
చిన్నారుల‌తో, రోగుల‌తో ఆస్ప‌త్రిలు నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం ఇది మొద‌టిసారి కాదు. చివ‌రి సారి కావాలంటే ప్ర‌భుత్వం క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: