కీల‌క‌మైన 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ భ‌విష్య‌త్ ఎలా ఉండ‌నుంది?  పార్టీలో స‌ర్వం తానైన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఈ ఎన్నిక‌ల క‌ఠోర ప‌రీక్షను ఎలా ఎదుర్కోనున్నారు? అస‌లు ఎన్డీఏకు అఏనులించే అంశాలేవి...వ్య‌తిరేకించే అంశాలేవి?  ఎన్డీఏను ఎదుర్కోవ‌డంలో ప్ర‌తిప‌క్ష‌ల వ్యూహాలేంటి అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాశంగా మారిన అంశం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి గెలుపోటములను 15 కీలక అంశాలు నిర్దేశించనున్నాయని విశ్లేష‌కులు భావిస్తున్నారు. గత ఐదేండ్ల పాలనలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆయా అంశాలను ఎదుర్కొన్న తీరు, అవి ప్రభావితం చేసే తీరును బట్టి అధికార కూటమి విజయావకాశాలుంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయా అంశాలు ఇవే.

1. నరేంద్రమోదీ :
దేశంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ పూర్తిగా ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకుంది. ప్రధాని పట్ల ఉన్న సానుకూలతను పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా తన చాతుర్యంతో ఓట్లుగా మలుస్తాడని ఆ పార్టీ నమ్ముతున్నది. మరోవైపు, మోదీకున్న కరిష్మా తగ్గిపోయిందని, చేసిన వాగ్దానాలు నెరవేర్చని కారణంగా ప్రజల్లో ఆయన ప్రతిష్ట దిగజారిందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. 

2.స్థిరమైన ప్రభుత్వం-బలమైన నాయకత్వం:
భారత్‌ తన సామర్థ్యాన్ని గుర్తించాలంటే మోదీ వంటి బలమైన నాయకుడు అవసరమని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలకు దీటైన నాయకుడు కనిపించడం లేదు. ఈ ఎన్నికలను అధ్యక్ష ఎన్నికల తరహాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో వెల్లడించాలని సవాలు విసురుతున్నది. 

3. జాతీయ భద్రత/ఉగ్రవాదం :
1990 నుంచి దాదాపు ప్రతి ఎన్నికల్లో ఇది ప్రధాన అంశం. కానీ పుల్వామా ఉగ్ర దాడి జరిగేంత వరకు ఈసారి జాతీయభద్రత అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పుల్వామా ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్‌ సిబ్బంది హతం కావడం, ప్రతీకారంగా పాక్‌ భూభాగంలోకి భారత విమానాలు దూసుకెళ్లి ఉగ్రవాద స్థావరంపై దాడి చేసి రావడం బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం కానుంది. యురి ఉగ్రదాడికి ప్రతీకారంగా లక్షిత దాడులు జరిపామని, తాజాగా బాలాకోట్‌లోని ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేశామని, దేశ భద్రత విషయంలో తాము రాజీపడబోము అని ఆ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేయనుంది. పాక్‌ వంటి మొండి దేశానికి కళ్లెం వేయడానికి మోదీ వంటి దైర్యవంతుడే ప్రధానిగా కొనసాగాలని బీజేపీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే పుల్వామా దాడి జరిగిందని, భారత వాయుసేన విమానాలు బాలాకోట్‌లో జరిపిన దాడి వల్ల కలిగిన ప్రయోజనం ఏమీ లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం తేలిపోతున్నది. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న జాతీయవాద భావాలు, సరిహద్దులో ఉద్రిక్తత ఓటర్లను బలమైన నాయకత్వం వైపు ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

4. అవినీతి:
అవినీతి అంశం 2014లో కాంగ్రెస్‌ను కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టింది. దీంతో తన హయాంలో ఎటువంటి కుంభకోణం జరుగకుండా మోదీ జాగ్రత్తలు తీసుకున్నారు. మోదీపై ఉన్న అవినీతి వ్యతిరేకి అన్న బలమైన ముద్ర కారణంగా ప్రజలు నోట్ల రద్దు అనే చేదు గుళికను మౌనంగానే మింగేశారు. రాఫెల్‌ ఒప్పందంలో కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్న ప్రచారం ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. 

5.మతాల వారీగా విభజన:
మునుపెన్నడూలేని రీతిలో ఈసారి దేశంలో మతాల మధ్య విభజన కనిపిస్తున్నది. ఈ అంశం గత ఎన్నికల్లో బీజేపీకి అనుకూలించగా, మైనారిటీ పక్షపాతిగా ముద్రపడిన కాంగ్రెస్‌ నష్టపోయింది. జమ్ముకశ్మీర్‌లో ఘర్షణలకు, పాక్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల వెనుక కూడా ఇదే అంశం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. సాధారణంగా ఇటువంటి పరిస్థితి బీజేపీకి అనుకూలించవచ్చు. కానీ మైనారిటీలు సంఘటితమై, ఎన్నికల నాటికి బాలాకోట్‌ వేడి తగ్గిపోతే పరిస్థితి మారవచ్చన్న వాదన వినిపిస్తున్నది. 

6.కులం:
ఈ ఎన్నికల్లో యాదవులు, జాతవ్‌లు (దళితులు), ముస్లింల ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలతో కూటమి కట్టి బీజేపీని నిలువరించవచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆయా కులాల వారు సంప్రదాయంగా ఓటు వేసే పార్టీలకు కాకుండా మోదీకి మద్దతుగా నిలిచారు. కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వారు మళ్లీ తమ పూర్వ పార్టీలకే మద్దతు పలికారు. రిజర్వేషన్ల కోటా అంశంపై అగ్రవర్ణాలు, దళితులు కూడా కాషాయ పార్టీకి దూరమయ్యారు. దీంతో అగ్రవర్ణాల వారిని మచ్చిక చేసుకొనేందుకు ఇటీవల 10 శాతం రిజర్వేషన్‌ ప్రకటించారు. 

7.ఉపాధి :
ప్రతిపక్షాల అమ్ముల పొదిలో ఓ ప్రధాన ఆయుధం. గత ఎన్నికల్లో యువత నుంచి భారీ మద్దతు పొందిన మోదీ వారికి ఉపాధి కల్పిస్తామంటూ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా మోసం చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోదీ హయాంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఉపాధి కల్పనపై ప్రభుత్వం అంకెల గారడీ చేస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్న మరో ఆరోపణ వినిపిస్తున్నది. అయితే ప్రభుత్వం ఈపీఎఫ్‌లో నమోదైన కొత్త సభ్యులు, ముద్రా రుణాలు అందుకున్న వారి సంఖ్యను చూపుతూ తమ హయాంలో ఉపాధి కల్పన జరిగిందని చెప్పుకుంటున్నది. భారత్‌-పాక్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నడుమ నిరుద్యోగం వంటి అంతర్గత సమస్యలకు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యం లభించకపోవచ్చని బీజేపీ భావిస్తున్నది.

8.గ్రామీణుల అసంతృప్తి:
గత ఎన్నికల్లో మోదీ విజయం వెనుక రైతులు/గ్రామీణ ఓటర్లు గణనీయమైన పాత్ర పోషించారు. కానీ ఈసారి వారు తమ వ్యవసాయ పెట్టుబడులకు తగిన లాభాలు రాక, వేతనాలు పెరుగక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నోట్ల రద్దుతోపాటు, వీధి పశువులు తమ పంటలను దెబ్బతీశాయని రైతులు భావిస్తున్నారు. గోసంరక్షణ పథకాల కారణంగా రైతులు తమ పశువులను వధకు అమ్ముకోలేక, వాటిని మేపలేక బయటకు తరిమేస్తున్నారు. దీంతో పంటలపై పడుతున్నాయి. ఇదే అంశాన్ని ఎత్తి చూపుతూ గత నవంబర్‌/డిసెంబర్‌లో జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్‌ దెబ్బకొట్టింది. దీంతో ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రైతులకు కొన్ని తాయిలాలు ప్రకటించింది. గృహ నిర్మాణం, మరుగుదొడ్లు, విద్యుత్‌, వంట గ్యాస్‌ వంటి అంశాలు రైతుల అసంతృప్తిని చల్లార్చవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

9.సామాజిక మాధ్యమాలు :
గత ఎన్నికల్లో కొత్తగా ప్రవేశించిన సామాజిక మాధ్యమాలు ఆయా పార్టీల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒక ఎజెండాను సెట్‌ చేయడానికి, ప్రత్యర్థులను దునుమాడటానికి అవి దోహపడ్డాయి. నిజానికి మోదీ విజయం వెనుక అవి ప్రధాన పాత్ర పోషించాయి. దీంతో కాంగ్రెస్‌ కూడా ఆ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అధికార పార్టీకి దీటుగా నిలిచింది. 

10.సంక్షేమ పథకాలు :
మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రారంభించడమే కాకుండా అవి సమర్థవంతంగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంది. ఉజ్వల, స్వచ్ఛ భారత్‌, పీఎం కిసాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలకు భారీ ప్రచారమే లభించింది. ఈ పథకాల వల్ల వచ్చే సానుకూలతతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించవచ్చని బీజేపీ భావిస్తున్నది. అయితే రుణ మాఫీ వాగ్దానంతో కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో లబ్ధి పొందింది. ఇదే అస్త్రాని ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రయోగించే అవకాశముంది. 

పై అంశాల‌కు తోడుగా ఐదేళ్ల పాల‌న‌లో ద్రవ్యోల్బణం, గోసంరక్షణ, యువ ఓటర్లు, మహిళలు, దళితులు- గిరిజనులు అనే అంశాలు కూడా ఈ ఎన్నిక‌ల్లో దేశంలోని ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డంలో దతుది నిర్ణ‌యాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: