కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, కేసీఆర్‌కు ఆప్తుడైన తుమ్మల నాగేశ్వర రావును ఓడించిన‌
ఎమ్మెల్యే టీఆర్ఎస్‌ గూటికి చేరనున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తాజాగా భేటీ అయ్యారు. టీఆర్ఎస్‌లో చేరేందుకు  ఉపేందర్ రెడ్డి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు.


ఇటీవ‌ల జ‌రిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 1950 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో సిట్టింగ్ మంత్రి అయిన తుమ్మ‌ల‌ ఓటమి పాలయ్యారు. కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజ‌క‌వ‌ర్గం స్థానికుడు. వృత్తిరీత్యాల కాంట్రాక్టర్ అయిన ఉపేంద‌ర్ రెడ్డిని తుమ్మ‌ల‌కు ధీటైన అభ్య‌ర్థిగా కాంగ్రెస్ రంగంలో దించింది. నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చిన ఉపేందర్ రెడ్డి.. ఖర్చుకు కూడా ఏ మాత్రం వెనుకాడలేదు. దీంతో హోరాహోరీ పోటీలో ఉపేంద‌ర్ రెడ్డి గెలుపొందారు. తుమ్మ‌ల ఓట‌మి పాల‌య్యారు. 


అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్తూ టీఆర్ఎస్‌లో చేరాల‌ని ఉపేంద‌ర్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ ప్రైవేట్ స‌మావేశంలో ఈ మేర‌కు కేటీఆర్‌ను క‌లిసి త‌న సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేశారు. ఉపేంద‌ర్ రెడ్డి ప్ర‌తిపాద‌న‌కు కేటీఆర్ ఓకే చెప్పార‌ని స‌మాచారం. త్వ‌ర‌లో ఆయ‌న సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ జంపింగ్‌పై తుమ్మ‌ల ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: