ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ హడావుడి మొదలైపోయింది. షెడ్యూల్ రాకముందు నుంచే హస్తినలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాటలతూటాలు పేల్చుకుంటున్నాయి. అయితే ఆ రెండు పార్టీలకు కూటముల పొత్తులు తలనొప్పిగా మారుతున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటోంది. బీజేపీయేతర కూటమిగా పోరాడేందుకు కలిసొస్తున్న పార్టీలు.. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికి మాత్రం ససేమిరా అంటున్నాయి.

Image result for congress alliance

జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలు చాలా వరకూ ఆ పార్టీపై కూటమి కట్టి పోరాడాలని పిలుపునిస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు మాత్రం అంగీకరించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు ముందుకు రాకపోగా... మరికొన్ని చోట్ల ఇతర పార్టీలతో  పొత్తుకు కాంగ్రెస్ అంగీకరించడం లేదు. కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థుతుల్లోనే పొత్తులు ఖరారు అవుతున్నాయి.

 Image result for congress alliance

జాతీయ స్థాయిలో కూటమి కావాలనుకుంటున్నప్పుడు.. రాష్ట్రాల స్థాయిలో పొత్తులు ఎందుకు వద్దనుకుంటున్నారన్నదే ఇప్పడు కాంగ్రెస్ ముందున్న పెద్ద ప్రశ్న. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు ఖరారు చేసేసుకున్నాయి.  అయితే తమ కూటమిలో కాంగ్రెస్ కి చోటిచ్చేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు.  ఈ రెండు పార్టీలు సొంత ప్రయోజనాల రీత్యా కాంగ్రెస్ ను దూరం పెట్టేశాయి. దేశరాజకీయాలను ప్రభావితం చేసే యూపీలోనే మహాకూటమికి గండిపడిపోయింది. కాంగ్రెస్ కు భంగపాటే మిగిలింది. యూపీ ని ఆనుకున్న ఉన్న అతి చిన్న రాష్ట్రం.. ఢిల్లీ.. దేశానికే గుండెకాయలాంటి ఢిల్లీలో అమ్ అద్మి పార్టీ అదినేత కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆప్ తో కూడా కాంగ్రెస్ కి పొత్తు పొసగలేదు. అపనమ్మకాలతో ఆప్ కాంగ్రెస్ ని దూరంపెట్టింది. రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేవని తేల్చేసింది. బీహర్ లో లాలూ ప్రసాద్ పార్టీ పొత్తులకు ఏమేరకు సహకరిస్తుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి.

 Image result for congress alliance

బెంగాల్ లో మమతా బెనర్జీ ఆదిపత్యమే కొనసాగుతోంది. మమతా బెనర్జీ అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పోరాడే.. సీఎం స్థాయికి ఎదిగారు. మమత పైకి మహాకూటమి అంటూ హడావుడి చేస్తున్నా.. బెంగాల్ లో కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించకపోవచ్చు. లేదంటూ ఒకటి, రెండు సీట్లతోనే సరిపెట్టేయాలని చూడొచ్చు. కాస్త దిగువకు వస్తే ఒడిశా.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం దగ్గరకు రానివ్వడం లేదు. అక్కడ కాంగ్రెస్ పొత్తుకట్టడానికి అవకాశమేలేదు. ఏపీలో టిడిపితో పొత్తు కుదుర్చుకోవాలని కాంగ్రెస్.. ఆరాటపడుతున్నా.. సీఎం చంద్రబాబు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. ఏపీలో కాంగ్రెస్ కి పొత్తుల అవకాశంలేదు.  

 Image result for congress alliance

మహరాష్ట్రలో, కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తు చాలాకాలం క్రితమే ఖరారైపోయింది. అయితే ఇప్పుడు అక్కడ  బీజేపీ, శివసేన కలిసి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఎన్సీపీ అదినేత అదే ఒప్పందానికి కట్టుబడి ఉంటారా..? లేక ఈ ఒప్పదంలో మార్పులు చేర్పులు జరుగుతాయా అన్నది అనుమానంగా మారిపోయింది. కర్ణాటకలో తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ.. జేడీఎఎస్ కి భారీగా సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఎదరైంది. అక్కడ పొత్తు కుదిరిందని సంబరపడాలో.. భారీగా సీట్లు వదులుకోవాల్సి వచ్చిందని బాధపడాలో చెప్పుకోలేని పరిస్థితిలో స్థానిక నేతలు తెగ బాధపడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత అనుకూలమైన పొత్తు ఒక్క తమిళనాడులో మాత్రమే దొరికింది. యూపీఏ రెండు విడతల పాలనలో పొందిన దానికి రుణం తీర్చుకోవాలనుకున్నారో ఏమో.. డిఎంకే నేత స్టాలిన్  నిజాయతీగానే వ్యవహరించారు. తమిళనాడులో కాంగ్రెస్ బలం అంతంతమాత్రమే. అయినా ఏకంగా 10 సీట్లు ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. కేరళలో కమ్యూనిస్టులు పూర్తిగా కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. అక్కడ కూడా పొత్తులకు సీన్ లేదు.

Image result for congress alliance

కాంగ్రెస్ బలంగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఛతీస్ గఢ్ రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ.. ఇతర పార్టీలను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. ఇలా అనేక రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క కర్ణాటక, తమిళనాడులో తప్ప రాష్ట్ర స్థాయిలో ఎక్కడా బలమైన పోత్తులు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో బలమైన కూటమి ఏర్పాటు చేయడం ఎలా సాధ్యం అన్న అనుమానాలు వ్యక్తవమువుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: