కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కగ్గల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి, వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ జెండా ఆవిష్కరన సందర్భంగా టీడీపీ వర్గీయులు రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇరువర్గాల తోపులాట సంద‌ర్భంగా తిక్కారెడ్డి గన్‌మెన్, పోలీసులు గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో తిక్కారెడ్డి కాలికి గాయం జ‌ర‌గ‌డంతో ఆయ‌న్ను ఆస్పత్రికి తరలించిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో ఓ కానిస్టేబుల్‌కు సైతం గాయాల‌య్యాయి. కాగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. 


మ‌రో వాద‌న ప్ర‌కారం, టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తుండ‌గా....గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇంతలోనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భార్య, ప్రదీప్ రెడ్డి అనే ఓ నేత‌ వచ్చి టీడీపీ జెండాను తొలగించి తిక్కా రెడ్డిపై దాడి చేశారని అంటున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిక్కారెడ్డి గన్ మెన్ గాల్లో కాల్పులు జరిపారని స‌మాచారం.

ఈ కాల్పుల్లో తిక్కారెడ్డి, మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కాళ్లకు బుల్లెట్ తగలడంతో కింద పడ‌టంతో ప‌రిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింద‌ని తెలుస్తోంది. పోలీసులు తిక్కారెడ్డిని చికిత్స కోసం తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: