రాజకీయాల్లో గోడ దూకుళ్ళు కామనే కానీ మరీ ఇంతలాగా  అని ఆశ్చర్యపోతున్నారు.  పొద్దున ఓ పార్టీ రాత్రికి మరో పార్టీ అన్నది దారుణమే. ఇది ఇంతకు ముందు లేనిది, కొత్తగా వచ్చిన కల్చర్. వరసగా పార్టీలు మార్చేస్తున్న వారి విషయం ఇపుడు పెద్ద ఎత్తున  హాట్ టాపిక్ అవుతోంది.


విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ ఇపుడు ఏ పార్టీ. అంటే సమాధానం బహుశా  ఆయన కూడా చెప్పలేరేమో. ఎందుకంటే కొణతాల ఇచ్చిన ట్విస్టులు ఒకటా రెండా. నిన్న కాక మొన్న వైసీపీ అధినేత జగన్ దగ్గర లోటస్ పాండ్ లో కనిపించిన ఈ పెద్దాయన ఇపుడు అమరావతిలో చంద్రబాబుతో ఏకాంత‌ సమావేశం నిర్వహించారు. మరి కొణతాల ఏ పార్టీ..


నిజానికి కాంగ్రెస్ వైసీపీ, టీడీపీ, మళ్ళీ వైసీపీ, మళ్ళీ టీడీపీ ఇలా కొణతాల  రాజకీయం  గిర గిరా తిరిగేస్తోంది. అన్ని పార్టీల  అధినేతలను కలవడం, ఆ పార్టీలోకే వస్తానని చెప్పడం, ఆ తరువాత ప్లేట్ ఫిరాయించడం కొణతాలకు అలవాటుగా మారిందని అంటున్నారు.


టీడీపీలో చేరిపోతారని అంతా భావించిన వేళ చివరి నిముషంలో వైసీపీకి జై  అంటూ లోటస్ పాండ్ కి వెళ్ళిన కొణతాల ఇపుడు మళ్ళీ అమరావతి నా రూట్ అంటున్నారు. మరి నిజాయతీగా రాజకీయాలు చేస్తారని పేరున్న ఈ మాజీ మంత్రి ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం పేరిట పరువు మొత్తం పోగొట్టుకుంటున్నారని సెటైర్లు పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: