ఉత్తరాంధ్రలో వెనకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో ఓ పోటీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు నువ్వా నేనా అని తలపడుతున్నారు. పంతం నీదా నాదా అంటూ తొడకొడుతున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలిక్కడ.


ఆముదాలవలస అంటే తమ్మినేని సీతారామ్ కి  ఒకపుడు పెట్టని కోట. ఆయన 1983లో అన్న నందమూరి తారకరామారావు టీడీపీని పెట్టినపుడు చేరి గెలిచిన నాయకుడు. ఆ తరువాత 1985లో మరోసారి ఆయన గెలిచారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పైడి శ్రీరామ్ముర్తి చేతిలో తొలి ఓటమి చూసిన తమ్మినేని 1994, 1999 ఎన్నికల్లో వరసగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్ లో యువజన సర్వీసుల మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2004 నుంచి ఆయన్ని పరాజయం వెక్కిరిస్తూ వస్తోంది. కాంగ్రెస్ కి చెందిన బొడ్డేపల్లి సత్యవతి చేతిలో తమ్మినేని  మరో మారు ఓటమి పాలు అయ్యారు. 2009 నాటికి ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయి పోటీ చేస్తే  అదే కాంగ్రెస్ అభ్యర్ధిని సత్యవతి మళ్ళీ ఓడించేశారు. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా తమ్మినేని బావమరిది కూన రవికుమార్ పోటీ చేసి మూడవ స్థానానికి నిలిచారు.


ఇక తమ్మినేని 2014 నాటికి వైసీపీలో చేరి పోటీ చేస్తే  సొంత బావమరిది కూన రవికుమార్ ఆయన్ని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. అయితే కూనకు వచ్చిన  మెజారిటీ కేవలం 5, 500 మాత్రమే.  మరి ఈసారి తన అద్రుష్టాన్ని పరీక్షించుకోవడానికి తమ్మినేని సిధ్ధపడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనకు ఇవి బహుశా చివరి ఎన్నికలు కూడా. గత రెండు దశాబ్దాలుగా గెలుపు పిలుపు అందుకోని తమ్మినేని మూడు పార్టీలు మారిపోయారు. ఇపుడు ఫ్యాన్ గాలి వూపులో గెలుస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. 


అయితే కూన ఎమ్మెల్యే అయ్యాక ఆముదాలవలసలో టీడీపీని పటిష్టం చేశారు. తాను బలమైన నేతగా అవతరించారు. పదేళ్ళుగా టీడీపీ క్యాడర్ కి అండగా ఉంటూ బావకే సవాల్ చేసే స్థాయికి ఎదిగారు. ఒకపుడు తమ్మినేని విజయం కోసం శ్రమించే రవికుమార్ ఇపుడు అవే వ్యూహాలను ఆయన్ని ఓడించడానికి వాడుతున్నారు. ఈ నేపధ్యంలో తమ్మినేని గెలుపు కోసం చమటోడ్చాల్సివస్తుంది. అయితే అయిదేళ్ళ టీడీపీ పాలన పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత, వైసీపీ పట్ల పెరిగిన అభిమానం, జగన్ పాదయాత్ర ఇవన్నీ తమ్మినేని విజయానికి బాటలు వేసేలా ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: