వైఎస్ వివేకానంద మ‌ర‌ణంపై మ‌రోమారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. సొంత చిన్నాన్న మరణాన్నే జగన్ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారని ఏపీ సీఎం విమర్శించారు. పార్టీ నేతలతో ఇవాళ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో, నెల్లూరులో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ, కుట్రలు, కుతంత్రాలు వైసీపీకి అలవాటేన్న బాబు.. వైఎస్‌ వివేకా హత్యను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించే యత్నం చేశారని నిలదీశారు.  'ప్రజల ముందు వైసీపీ తప్పుడు అజెండా పెడుతోంది. అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తోంది. వైసీపీ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటేనే ఆ పార్టీ ఎంతగా భయపడుతోందనే విషయం అర్ధమవుతోంది' అని అన్నారు. రాష్ట్రం మొత్తాన్ని పులివెందుల చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని బాబు ఆరోపించారు. 


ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా బాబు ఘాటుగా స్పందించారు. తాను మూడు వేల సార్లు తిట్టానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటున్నారని.. కానీ ఆంధ్రులను ఆయన తిట్టిన విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు.  తెలంగాణలో పార్టీలు లేకుండా చేస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడు ఏపీపై దాడి ప్రారంభించారని విమర్శించారు. పార్టీకి చెందిన డేటాను పక్క రాష్ట్రం వ్యక్తులు చోరీ చేశారన్న బాబు.. కేసీఆర్‌కు దమ్ముంటే ఏపీకి వచ్చి తనపైన పోటీకి నిలబడాలని సవాల్‌ విసిరారు. 


టీడీపీకి కార్యకర్తలే అసలైన బలమని.. తాను ఎప్పుడూ కార్యకర్తల మనిషినేనని, కార్యకర్తల త్యాగాలను గౌరవించే వ్యక్తినని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. నెల్లూరు ఎన్నికల సన్నాహక సభలో ప్రసంగిస్తూ ఆయన మాట్లాడుతూ.. వచ్చిపోయే నేతలతో టీడీపీ ఒరిగేదేమీ లేదన్నారు. స్వార్థం కోసం పార్టీ మారే నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.  పట్టిసీమ ద్వారా శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని అందించామన్న బాబు.. గోదావరి-పెన్నా నదుల అనుసంధానికి  శ్రీకారం చుట్టామని చెప్పారు. జిల్లాలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్న ఆయన.. జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలనూ ఏకం చేసే శక్తి టీడీపీకే ఉందన్న బాబు.. 25 మంది ఎంపీలుంటే ప్రధానిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: