విజయనగరం జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే ఇద్దరు నేతలే దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ నుంచి పూసపాటి అశోక్ గజపతి రాజు, కాంగ్రెస్ నుంచి బొత్స సత్యనారాయణ ఢీ అంటే ఢీ కొడుతూ వస్తున్నారు. ఒకసారి వారికి అధికారం, మరోసారికి వీరికి అధికారం ఇలా చలాయిస్తూ జిల్లా రాజకీయాలను తమ గుప్పిట పడుతున్నారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా అటు బొత్స, ఇటు అశోక్ తన బలాన్ని పార్టీలో చాటుకున్నారు. దాంతో  పాటే వారి కుటుంబాలకు టికెట్లు తెప్పించుకున్నారు. వీరి డిమాండ్లకు టీడీపీ, వైసీపీ అగ్ర నాయకత్వాలు తల వంచక తప్పలేదు.


ముందు నుంచి తన వర్గం వారికి టికెట్లు ఇప్పించుకోవడం  కోసం పంతం పట్టిన బొత్స చివరకు దాన్ని నెరవేర్చుకున్నారు. జగన్ వంటి అధినేతను కూడా ఒప్పించి సీట్లు సాధించుకోవడం బొత్సకే చెల్లిందని కూడా అంటున్నారు. చీపురుపల్లికి బొత్స పోటీ చేస్తుంటే గజపతినగరానికి ఆయన తమ్ముడు బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్లకు బొత్స దగ్గర బంధువు బండికొండ అప్పలనాయుడు, విజయనగరం ఎంపీకి మరో బంధువు బెల్లాల చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఇక బొత్స అనుచరుడు అలజంగి జోగారావుకు పార్వతీపురం, మరో అనుచరుడు శంబంగి చిన అప్పలనాయుడుకు బొబ్బిలి టికెట్ దక్కించుకున్నారు. ఎస్ కోటలో కూడా ఆయన అనుచరుడు శ్రీనివాస్ కి టికెట్ బొత్స తెచ్చుకున్నారు. ఆయన వర్గంలో కురుపాం ఎమ్మెల్యే శ్రీవాణి కూడా ఉన్నారు. మొత్తానికి చూస్తే విజయనగరంలో  ఒక్క కోలగట్ల వీరభద్రస్వామి తప్ప మొత్తం అన్ని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు బొత్స ఇష్టప్రకారమే జగన్ ఇచ్చేశారు.


ఇక అశోక్ విషయానికి వస్తే ఆయన ఈ తరహా వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ 2014 తరువాత ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. తాను విజయనగరం ఎంపీగా పోటీ చేసి డిల్లీకి వెళ్తే ఇక్కడ తన రాజకీయ ఆధిపత్యానికి గండి కొట్టేవారు తయారుకావడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. దాంతో తన వారసత్వాన్ని కొనసాగించినట్లైతేనే హవా చలాయించగలమని అశోక్ భావించారు. నాటి నుంచి కుమార్తె అతిధి గజపతిరాజును పార్టీలో ప్రవేశపెట్టారు. ఆమెను అసెంబ్లీకి పోటీ చేయించాలనుకున్నారు. అయితే మొదట్లో చంద్రబాబు అంగీకరించలేదు కానీ అశోక్ అలక, పట్టుదల చూసిన తరువాత టికెట్ ఇవ్వకతప్పింది కాదు. మరో వైపు అశోక్ విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నారు. తన వారికి కూడా జిల్లాలో రెండు టికెట్లు ఇప్పించుకున్నారు. ఇలా ఇద్దరు నేతలూ జిల్లాలో తమ హవా ఎక్కడా తగ్గకుండా రాజకీయం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: