కర్నూల్ జిల్లాలోని నియోజకవర్గాల్లో డోన్ ఒకటి. ఇది రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేసిన కోట్ల విజయభాస్కరెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి కూడా ఇక్కడి నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. ఇటువంటి రాజకీయ ప్రాముఖ్యత కలిగిన ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన బుగ్గన రాజేంద్రనాథ్, టీడీపీ అభ్యర్థి ఈడిగా ప్రతాప్ పై విజయం సాధించి అసెంబ్లీ లో అడుగుపెట్టారు. డోన్ అసెంబ్లీ నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. ఇప్పటివరకు ఇక్కడ పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు అధిక సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీలు ఆధిపత్యం పంచుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ కే.ఈ. కుటుంబం అత్యధిక సార్లు విజయం సాధించారు. 1978 లో కే.ఈ. కృష్ణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికై విజయం సాధించి ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత మరో మూడుసార్లు కాంగ్రెస్,టీడీపీ ల నుంచి విజయం సాధించారు. ఇక 2004 లో కోట్లసుజాతమ్మ బరిలో నిలిచి కోట్ల కుటుంబ వ్యక్తిగా  డోన్ రాజకీయాల్లో ప్రవేశించారు. అయితే 2009 లో ఈ స్థానాన్ని టీడీపీ తిరిగి కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో కే.ఈ.కృష్ణమూర్తి పత్తికొండకు మారగ టీడీపీ నుంచి ఈడిగ ప్రతాప్ పోటీ చేశారు. అయితే పోటీ బుగ్గన రాజేంద్రనాథ్ గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఈసారి కూడా ప్రధాన పోటీ ఈ ఇద్దరి నాయకుల మధ్యే జరగబోతోంది. ఇప్పటికే అభ్యర్థులు ఎవరు అనేది ప్రకటించేశారు. టీడీపీ నుంచి ఈడిగ ప్రతాప్ ను పోటీ లో నిలపెడుతున్నట్టు పార్టీ అధినేత చెప్పారు. ఇటు వైపు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న బుగ్గన రాజేంద్రనాథ్ ను బరిలో ఉంచారు. అయితే ఇక్కడి నుండి జనసేన, కాంగ్రెస్ లు కూడా పోటీ పడబోతున్నాయి. మరి ఈసారి డోన్ డాన్ ఎవరు కాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: