పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఎన్నో చెప్పారు. ఆవేశంలో కొట్టిన సినిమా డైలాగులు అన్నీ ఇన్నీ కావు. అధికారం ఎపుడు ఒకటి రెండు కుటుంబాల చేతుల్లోనేనా అంటూ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. అంతే కాదు, యువతకు అధికారం దక్కాలని కూడా నినదించారు. తమ పార్టీ తేడా పార్టీ  అని, అందరికీ సమాన అవకాశాలు ఇస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అంతేనా విశాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు వలస వాదులేంటని పవన్ విసుక్కున్నారు. తాను స్థానిక నాయకత్వానికే పట్టం కడతానని కూడా ప్రవచించారు సీన్ కట్ చేస్తే పవన్ పార్టీ జనసేన జాబితాలో అనేకమంది నాన్ లోకల్ లీడర్లే కనిపిస్తున్నారిపుడు. అంతెందుకు విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేస్తున్న మాజీ పోలీస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ అచ్చంగా దిగుమతి సరుకు.

నాన్ లోకల్. ఆయన గారు పుట్టింది కడప, పెరిగింది  కర్నూల్. అంటే విశాఖకు కర్నూలుకూ యోజనాల దూరం ఉందన్న మాట. అక్కడ నేతను ఇక్కడకు తీసుకు వచ్చి మీ ఎంపీ అభ్యర్ధి అంటూ పరిచయం చేయడం ద్వారా పవన్ ఏం సందేశం ఇస్తున్నారో. ఇక అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి తీసుకున్నా పక్కా నాన్ లోకల్. ఇక్కడ పార్ధసారధికి టికెట్ ఇచ్చారు. ఆయన సైతం గుంటూర్ జిల్లాకు చెందిన వారు. మాజీ అధికారి ఈయన. ఇక భీమునిపట్నం ఎమ్మెల్యే విషయానికి వస్తే ఆయన సైతం విజయవాడ వాసిగా తేలింది. ఈ సీటును పంచ‌కర్ల సందీప్ కి ఇచ్చారు. ఇక పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నక్కా రాజబాబుకు ఇచ్చారు. అదే విధంగా విశాఖ ఉత్తరం సీటుని కూడా ఇతర జిల్లాలకు చెందిన పసుపులేటి ఉషాకిరణ్ కి ఇచ్చారు. అన్నింటికీ మించి గాజువాక సీటుని లోకల్ అభ్యర్ధులకు ఇవ్వకుండా పవన్ తానే పోటీ చేస్తున్నారు.


దీని మీద పార్టీలోనూ బయటా కూడా విమర్శలు వస్తున్నాయి. పవన్ చెప్పిందేంటి, చేసిందేంటని జనసైనికులే అడిగేస్తున్నారు. తాను పోటీ చేయడానికి వీలుగా గాజువాకకు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యకు పెందుర్తి సీటు ఇచ్చి అక్కడ నాన్ లోకల్ ని పెట్టారు. అలాగే విశాఖ తూర్పుకు అదే గాజువాకకు చెందిన మరో నెత కోన తాతారావుని  బదిలీ చేసి అక్కడ ఆయన్ని దిగుమతి చేశారని సెటైర్లు పడుతున్నాయి. మరి పవన్ ఇంతకీ లొకల్ అంటూ గొంతు చించుకుని చివరికి తాను ఇచ్చింది కూడా వలస పక్షులకే టికెట్లు. ఈ మాత్రం రాజకీయం కోసం మార్పు, తీర్పు అంటూ ప్రసంగాలతో ఊదరగొట్టడం ఎందుకని అంతా ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: