విశాఖ జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం అనకాపల్లి. ఇక్కడ ఎమ్మెల్యే సీటు హాట్ హాట్ అంటోంది.   ఇక్కడ ఎన్నో పార్టీలు ఉన్నా కూడా ప్రధానంగా పోటీ టీడీపీ, వైసీపీల మధ్యన ఉంది. జనసేన కూడా పోటీలో ఉన్నా ఎంతమేరకు ప్రభావం చూపుతుంది, ఎవరి ఓట్లకు గండి కొడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. 


ఇక ముందుగా అసెంబ్లీ సీటు విషయం తీసుకుంటే  అనకాపల్లిలో కాపులు, గవరలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రెండవ మారు బరిలో ఉన్నారు. ఆయన తాను చేసిన అభివ్రుధ్ధినే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. బలమైన గవర సామాజిక వర్గం అండదండలు ఆయనకు ఉన్నాయి. దాంతో గెలుపు సునాయసం అవుతుందని భావిస్తున్నారు. వైసీపీ నుంచి బలమైన కాపు నాయకుడు గుడివాడ అమర్నాధ్ బరిలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి  ఓడిపోయారు. దాంతో అయిదేళ్ళ అనుభవంతో మరో మారు పోటీలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ టికెట్ ఆశించిన ప్రముఖ రాజకీయ కుటుంబం దాడి వీరభద్రరావు ఇపుడు వైసీపీ గెలుపునకు పూర్తిగా సహకరిస్తున్నారు. దాంతో గట్టి పోటీ నెలకొని ఉంది.


అదే సమయంలో జనసేనని కూడ తీసిపారేయాల్సింది లేదు.   ఇక్కడ ఆ పార్టీ మంత్రి గంటా శ్రీనివాసరావు చుట్టానికే టికెట్ కేటాయించింది. అనకాపల్లితో అనుబంధం ఉన్న పరుచూరి భాస్కరరావు పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా రాజకీయంగా పలుకుబడి ఉంది. ఆయన జనసేన నుంచి కావడంతో కాపుల ఓట్లు భారీగా చీలుతాయా అన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే వైసీపీ అభ్యర్ధికి ఇక్కడ ఇబ్బంది అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే వైసీపీ గాలి బలంగా వీస్తున్నందున అటువంటిదేమీ లేదని, ఘన విజయం సాధిస్తామని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పోటీలో ఉన్న వారి పాత్ర నామ మాత్రమేనని చెప్పకతప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: