కేఏ పాల్..ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర కామెంట్లతో ఆయ‌న వార్త‌ల్లో నిలుస్తుంటారు. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న‌తో పాల్ తెర‌కెక్కారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుంచి బ‌రిలో దిగేది పాల్ వెల్ల‌డించారు. న‌ర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా, భీమ‌వ‌రంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు పాల్‌ తెలిపారు. 22న ఉదయం నామినేషన్‌ వేస్తాని ఆయన ప్రకటించారు. పాల్ రెండు చోట్ల నుంచి బ‌రిలో దిగ‌డం, అవి ముఖ్య‌మైన స్థానాలు కావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


కాగా, న‌ర‌సాపురం ఎంపీగా సినీ న‌టుడు నాగ‌బాబు బ‌రిలో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ త‌ర‌ఫున నాగ‌బాబు బ‌రిలో నిలుస్తున్నారు. మ‌రోవైపు భీమ‌వ‌రం నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అన్నా, త‌మ్ముడిని ఏక‌కాలంలో టార్గెట్ చేసేందుకు పాల్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, జ‌న‌సేన పార్టీతో పొత్తుకు పాల్ ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే.


ఇదిలాఉండ‌గా, తాజాగా విశాఖపట్నంలో బ్యాంక్ అధికారుల‌తో గొడవప‌డి పాల్ వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌ జైల్ రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన సొసైటీ పేరుతో ఉన్న ఫ్రీజ్ అయిన అకౌంట్ లోని డబ్బులు తీసుకునేందుకు అనుమతించాలని ఆయన అధికారులను అడిగారు. కానీ అందుకు బ్యాంకు అధికారులు ఒప్పుకోలేదు. దీంతో ఆయన కాస్తా గొడవకు దిగారు.

సొసైటీ తనదేనని, సొసైటీకి తానే అధ్యక్షుడినని కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చిందంటూ అధికారులకు తెలిపారు. నేపథ్యంలో, మీకు డబ్బు ఇవ్వాలంటే తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని... మీకు డబ్బు ఇవ్వచ్చంటూ ఇంతవరకు తమకు ఆదేశాలు రాకపోవడంతో డబ్బు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు పాల్ కు స్పష్టం చేశారు. దీంతో పాల్ వెనుదిరిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: