ఓ రాజకీయ పార్టీ అధినేతగా విశాఖలో తొలి ప్రసంగం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం చెబుతాడోనని ఆశపడిన వారికి ఆ ముచ్చట తీర్చేశారు.  టీడీపీ, జనసేనల  మధ్యన ఉన్న అవగాహనపై అనుమానాల సంగతి ఎలా ఉన్న పవన్ మాత్రం ఎక్కడా చంద్రబాబును పల్లెత్తు మాట అనకుండా ఆ అనుమానాలు నిజం చేసేలా వ్యవహరించారు. పైగా మాట మాటకూ జగన్ని, ఆయన పార్టీని ఆడిపోసుకోవడం ద్వారా తాను బాబు వూసు ఎత్తనంటే ఎత్తనని చెప్పకనే చెప్పేశారు. జగన్ జాతకం మొత్తం మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వద్ద ఉందని వెటకారమాడిన పవన్ బాబు పాలనలో  అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదో ఆయకే తెలియాలి మరి. నిన్నటి దాకా స్థానికులకే టికెట్ అంటూ నినదించిన పవన్ ఇపుడు కర్నూల్  నుంచి తీసుకొచ్చిన లక్ష్మీనారాయణని జనం మీద అభ్యర్ధిగా   పెట్టడం ఎంత మేరకు సబబని సమర్ధించుకుటారో మరి.



అసలు వారిని వదిలేసి కొసరు వారి మీద తన మాటల ప్రతాపం చూపించారు జనసేనాని. అయిదేళ్ల చంద్రబాబు పాలనలోని అవినీతి,  అక్రమాలను ఏకరువు పెట్టకుండా, చీల్చిచెండాడకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు మీద పవన్  అక్కసు వెళ్ళగక్కారు. తన దెబ్బకు గంటా భీమిలీ నుంచి వేరే చోటకు పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. గంటా వంటి వారిని ఎన్నుకుంటే భూ కబ్జాలే అంటూ హాట్ కామెంట్స్ చేసిన పవన్ ఆయన పోటీ చేస్తున్న విశాఖ ఉత్తరంలో మాత్రం  మాత్రం బలమైన అభ్యర్ధి ఉన్నా నిలబెట్టలేకపోవడం వెనక కారణాలేంటో మరి. కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసి అంత వ్యతిరేకతలోనూ సిటీలో అరవై వేల ఓట్లకు పైగా తెచ్చుకున్న బొలిశెట్టి సత్యనారాయణని గంటా మీద పోటీకి పెట్టి ఉంటే పవన్ అన్న మాటల్లో నిజాయతీ ఉండేది. ఏదో పోటీకి పెట్టామన్నట్లుగా వైసీపీ నుంచి వచ్చిన మహిళా  నేతకు టికెట్ ఇచ్చిన పవన్ బయటకు మాత్రం గంటాపైన తానే పోరాడుతున్నట్లుగా కామెంట్స్ చేశారు.



జగన్ పార్టీకి ఓటేస్తే విశాఖలో రౌడీల రాజ్యం వస్తుందని, ఆ పార్టీకి  ఓటేయరాదని పవన్ ఇచ్చిన పిలుపు కూడా విమర్శల పాలవుతోంది. ఇపుడు ఏపీలో ఉన్నది టీడీపీ సర్కార్ దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా పవన్ వైసీపీనే టార్గెట్ చేయడం ద్వారా తన అజెండా ఏంటో బయటపెట్టుకున్నారంటున్నారు.   తనకు చిల్లి గవ్వ లేదని, ప్రజలే తన బలమని చెప్పుకున్న పవన్ అపుడే అవిడవిట్ దాఖలు చేసిన దాంట్లో కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ప్రకటించిన సంగతి జనాలకు గుర్తుండదు అనుకున్నారేమో మరి.  ఇక పవన్ విశాఖ టూర్ల ఎన్నో పదనిసలు ఉన్నాయి. విశాఖలో తన పార్టీ ఎమ్మెల్యేలకు మద్దతుగా ప్రచారం చేస్తూనే గాజువాకలో తాను పోటీలో ఉన్నాను,  తనకు ఓటేయమని చెప్పుకోవడం విడ్డూరమే. ఇక తన పార్టీ అభ్యర్ధులు ఓడిపోయినా సహిస్తాను కానీ ఇతర పార్టీల్లోకి వెల్తే మాత్రం తాట తీస్తానంటూ పవన్ చేసిన హెచ్చరికలు ఏ రకమైన ప్రజాస్వామ్యంలో చెప్పాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: