ఇప్ప‌టికే వ‌ల‌స‌ల‌తో కుదేల‌వుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత ఒక‌రు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో ప‌రిణామాల‌ను నిర‌సిస్తూ ఆయ‌న రాజీనామా చేశారు. అలా కాంగ్రెస్‌కు షాకిచ్చింది మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్క‌ర్‌. పార్టీ కోసం ఎంత నిబద్దతతో పనిచేసినా త‌న పట్ల నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోందని, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విధేయులను మరిచి పార్టీ ఏక పక్షంగా వ్యవరిస్తున్నదని పార్టీకి గుడ్ బై చెప్పారు. 


రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎదిగే సూచనలు కనిపించటం లేదని రాపోలు ఆనంద్ భాస్క‌ర్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపనున్నట్లు రాపోలు వెల్ల‌డించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న త‌న‌ను కావాలనే పక్కన పెడుతున్నారని, అయినా పార్టీ కోసం సంస్థాగతగా కృషి చేశానని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏ పార్టీలో చేరే విష‌య‌మై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 


రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ఝలక్ అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే ప్ర‌జాప్ర‌తినిధుల‌ను చేజార్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా ముఖ్య‌నేత‌ను కోల్పోవ‌డం ఆ పార్టీకి దెబ్బ వంటిదేన‌ని చెప్తున్నారు. రాహ‌లు్ గాంధీకి రాసే లేఖ‌లో రాపోలు ఏ విష‌యాలు పేర్కొంటార‌నే ఆస‌క్తి పార్టీ నేత‌ల్లో నెల‌కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: