అవినీతి, అరాచకం ఈ పదాల రైమింగ్ ఎలా అతికినట్లు ఉంటుందో అవి కూడా పక్క పక్కనే ఉంటాయి. వాటి పవర్ ఏంటన్నది కూడా అందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు కూలాలన్నా, రావాలన్నా ఈ పదాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బలం కూడా చాలా ఎక్కువగానే ఉంది.


విషయానికి వస్తే చంద్రబాబు 2014 ఎన్నికల్లో జగన్ అవినీతి అంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేసి లబ్ది పొందారు. ఐదేళ్ళ పాటు అదే పనిగా పాట పాడుతూ వచ్చారు. ఇపుడది అరిగిపోయిన రికార్డు అయిపోయింది. మళ్ళీ జగన్ని బదనాం చేసేందుకు అవినీతి అనే ఆయుధం ఉపయోగపడదు. ఎందుకంటే అది తుప్పు పట్టిపోయింది. పైగా ఇపుడున్న టీడీపీ ప్రభుత్వం మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దాంతో పోలిస్తే జగన్ విషయం పూర్తిగా పక్కకు పోతుంది. సరిగ్గా ఈ సమయంలో వారం క్రితం జరిగిన వైఎస్  వివేకా దారుణ హత్యను పట్టుకుని టీడీపీ  తెగ వాడేసుకుంటోంది.  ఆ హత్య జగన్ ఇంట్లో వారే చేయించారంటూ ఇపుడు వూరూరా తిరుగుతూ ఆ పార్టీ నాయకులు  టముకు వేస్తున్నారు.


నిజానికి ఈ దారుణ హత్య నుంచి సానుభూతి పొందితే కడపతో పాటు ఏపీలోనూ వైసీపీకి ఎదురు ఉండదని భావించారో ఏమో  వెంటనే టీడీపీ  నేతలు మేలుకుని దాన్ని మించిన వ్యూహం రచించి కట్టు కధలు, పిట్ట కధలతో జగనే ఈ హత్యను చేయించారని వారం రోజుల్లో తనదైన దర్యాప్తు చేయించేశారు. ఎటూ ప్రభుత్వం ఉంది కదా అని  ఈ విషయంలో కావాల్సిన బురదను అనుకూల పత్రికల ద్వారా వేయించేస్తున్నారు. రోజుకో కధనంతో వండి వారుస్తున్న వార్తలు చనిపోయిన వివేకా ఆత్మకు శాంతి లేకుండా చేయడమే కాదు. బతికున్న వైఎస్ కుటుంబాన్ని అశాంతికి గురి చేస్తున్నాయి. ఈ రకమైన కధనాలు తగునా అని ఏకంగా వివేకా కూతురు మొర పెట్టుకున్నా అనుకూల మీడియా ఎక్కడా తగ్గడంలేదు.


ఇక  ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా ఇదే అంశంతో నింపేసి చంద్రబాబు జగన్ని అరాచకవాదిగా చిత్రీకరిస్తున్నారు. ఏం తమ్ముళ్ళూ అంటూ జనంలో ప్రశ్నలు సంధిస్తూ వైసీపీ వస్తే మరణ శాసనమేనని గట్టిగా హెచ్చరిస్తూ తనదైన రాజకీయం చేసేస్తున్నారు. మరి నాడు అవినీతి కధలు వర్కౌట్ అయ్యాయి. మరి ఇపుడు అరాచకం సినిమా హిట్ అవుతుందా. లేకపోతే అయిదేళ్ళ టీడీపీ పాలనలో ఎన్నో హత్యలు, ఎమ్మెల్యేల దాడులు, కాల్ మనీ కేసులు చూసిన జనం పట్టించుకోకుండా  న్యూట్రలైజ్ అయిపోతారా.. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: