ఆయన అవినీతిని ఆటకట్టించే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో ఉన్నతాధికారి. తాను చేపట్టిన కేసుల ద్వారా పాపులర్ అయిన అధికారి. ఆయన నీతి నిజాయతీల మీద జనం ఎంతో మమకారం పెంచుకున్నారు. ఆయన్ని రోల్ మోడల్ గా ఎంతో మంది యువత తీసుకున్నారు. ఆయన్ని కులానికి, మతానికి, రాజకీయాలకు, పార్టీలకు  అతీతంగా అంతా చూశారు. అభిమానించారు. 


మరి అటువంటి మాజీ జేడీ కాస్త రాజకీయ పులుసులో పడిపోయారు. ఆయన భావాలు, ఆలోచనలకు భిన్నంగా జనసేనలో చేరిపోయారు. తన సిద్ధాంతాలు, జనసేనవీ ఒక్కటే అంటున్నారు. కానీ జనం మాత్రం అది పట్టించుకోవడం లేదు. జేడీ ఇంకా ఎక్కువని వారి భావన. ఆయన ఏదో ఓ రాజకీయ పార్టీలో చేరిపోయి ఎంపీ, ఎమ్మెల్యే అవాలని వారు కోరుకోలేదు. ఆయన సొంతంగా ఓ ప్రజా  వేదికను ఏర్పాటు చేయాలని భావించారు. ఆయన పూర్తి లక్ష్యాలు, సిధ్ధాంతాలు జనంలోకి వెళ్ళాలని కోరుకున్నారు


కానీ జేడీ ఓ రాజకీయ పార్టీ అధినేత ముందు చేతులు కట్టుకుని నిలబడాలని ఎపుడూ కోరుకోలేదు. ఆ మాటలు వస్తే ఇపుడున్న పార్టీలకు ఉన్న సిధ్ధాంతాలు ఏంటి, అవి ఎంతవరకూ అమలు చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. కులం, మతం, ప్రాంతానికి కట్టుబడి రాజకీయం చేయడం, ఏ ఎండకు ఆ గొడుకు పట్టడం అలవాటుగా మారింది. పదవి చుట్టూ రాజకీయం నడుస్తోంది. అన్ని పార్టీలూ అలాగే సాగుతున్న దశలో ఈ మాజీ జేడీ కూడా ఆ రొచ్చులో పడిపోవడం చూసిన వారికి షాక్ ఇస్తోంది.


ఇక్కడో విషయం చెప్పుకోవాలి. జేడీ తాను స్వచ్చందగా ప్రజా జీవితంలోకి వచ్చానని చెప్పుకున్నారు. ఏపీలోని పదమూడు జిల్లాల్లో ఆయన పర్యటించారు. ముఖ్యంగా  గ్రామాలు, రైతులు అన్నారు. వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను బాగు చేస్తానని చెప్పారు. ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి ఆలోచన చేస్తానని అన్నారు. అక్కడే ఉంటూ తన కార్యక్షేత్రాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. మరి ఆయన చేసిందేంటి. భిన్నమైన తీరులో ఆయన రాజకీయం సాగుతోంది. ఆయన విశాఖ వంటి మెట్రో సిటీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడే జేడీ అభిమానులు సైతం బాధ పడాల్సి ఉంటోంది.



అలాగే జేడీ సైతం పదవుల కోసం వచ్చారా అన్న అనుమానాలే కలుగుతున్నాయి. రాజకీయాలకు పరమావధి పదవులు కాదు, అధికారం కాదు, మార్పు అంటూ చెప్పుకొచ్చిన ఈ మాజీ జేడీ మరి కొన్నాళ్ళు ఎందుకు ఆగలేకపోయారు. తాను సంకల్పించిన  ప్రజాచైతన్యం  మిషన్ని ఎందుకు మరింత వ్యవధి తీసుకుని జనంలోకి తీసుకువెళ్ళలేకపోయారు. ఆదరా బాదరాగా ఎన్నికలు వస్తే ఏదో పార్టీలో చేరి పోటీ చేయడమేనా మాజీ జేడీ గమ్యం అని ప్రశ్నలు వస్తున్నాయి. తనకంటూ  సొంత శైలి కలిగిన జేడీ సొంత విధానాలతో ముందుకు వస్తే ఉభయ రాష్ట్రాలు హర్షించేవి. . కానీ ఇపుడు ఆయన ఓ పార్టీలో చేరి సాధారణ ఎంపీగా పోటీ చేసి గెలిచినా, ఓడినా ఆయన మార్క్ మార్పు, ప్రభావం అన్నవి జరగడం కష్టమేనని మేధావుల నుంచి వినిపిస్తున్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: