తెలంగాణ రాష్ట్ర స‌మితిలో కీల‌క అంశానికి ఫుల్ స్టాప్ ప‌డింది. గత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సునాయాసంగా 11స్థానాలు కైవసం చేసుకోగా, ఇటీవల శాసనసభ ఎన్నికల్లో రికార్డువిజయం సాధించిన ఊపులో ఉన్న టీఆర్‌ఎస్‌ మొత్తం 16స్థానాలు సాధించాలన్న ఉత్సాహంతో పరుగెడుతోంది. ఇలా సాగుతున్న క్ర‌మ‌లో టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప‌లువురు సిట్టింగ్ ఎంపీల‌కు సీట్లు ఇ్వ‌వ‌ని సంగ‌తి తెలిసిందే. అందులో  ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ఒక‌రు. తాజాగా పొంగులేటి ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు.


టీఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారి ఆదివారం ఖమ్మం వచ్చిన పొంగులేటిని కలుసుకొనేందుకు ఆయన కార్యాలయానికి అభిమానులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో కార్యాలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ఏ ఒక్కరూ అసహనానికి లోనవకుండా, పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, బంగారు తెలంగాణ నిర్మాణానికి నిరంతరం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ బాటలో పయనిస్తే భవిష్యత్‌లో కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.


ముఖ్యమంత్రిపైనా, టీఆర్‌ఎస్ పార్టీ పైనా ప్రగాఢ విశ్వాసమున్నదని పొంగులేటి ప్ర‌క‌టించారు. నాలుగున్నరేండ్లలో అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా తాను టీఆర్‌ఎస్ పార్టీని వీడేదిలేదని స్పష్టంచేశారు. సీఎం అడుగుల్లో అడుగేస్తూ టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి, బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషిచేస్తానని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: