కొన్నాళ్ళ క్రితం వరకూ విశాఖ రూరల్ జిల్లాలో వైసీపీ గెలిచే సీటు ఏంటి అంటే  ఎలమంచిలి అని ఠక్కున చెప్పేవారు. ఎందుకంటే అప్పట్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీద విపరీతమైన వ్యతిరేకత ఉండడం, వైసీపీ బలంగా ఉండడం వంటి కారణాలు అనేకం ఈ అభిప్రాయాన్ని కలిగించాయి. రెండు మార్లు ఎలమంచిలి ఎమ్మెల్యేగా నెగ్గి జిల్లా రాజకీయాలను శాసించిన కన్న బాబు రాజు వైసీపీలో అప్పట్లో చేరడంతో ఈ సీటు ఆ పార్టీదేనని అంతా భావించారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మొత్తం సీన్ మారుతోంది. దీనికి ఇతర పార్టీల రాజకీయంతో పాటు వైసీపీ స్వయంక్రుతాపరాధం కూడా కారణంగా చెప్పుకోవాలి.


కన్నబాబు రాజు మంచి నాయకుడే కానీ ఆవేశం పాలు ఎక్కువ. అలాగే అందరినీ చేరదీసే చొరవ తక్కువ. దాంతోనే వైసీపీకి బలమైన కోట ఇపుడు చెదిరిపోతోంది. కన్నబాబు రాజు రాకముంది వైసీపీకి ఇద్దరు సీనియర్లు ఇంచార్జులుగా పనిచేశారు. ప్రగడ నాగేశ్వ‌ర రావు, బొడ్డేడ ప్రసాద్. ఈ ఇద్దరూ గట్టి నాయకులే కాదు, సామాజికపరంగా బలమైన నేతలు. ఇక్కడ కాపులు, గవరలు ఎక్కువ. ఆ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలను దగ్గరకు తీయడంలో కన్నబాబు రాజు అలక్ష్యం వహించారు. దాంతో వారు సొంత పార్టీ మీదనే తిరుగుబాటు చేశారు. హై కమాండ్ కూడా వారిని పట్టినుకోకపోవడంతో ఇక్కడే సరిగ్గా గురి చూసి  టీడీపీ పావులు కదిపింది.


ఆ పార్టీకి ఇపుడు బలమైన నేతల అవసరం చాలా ఉంది టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన సుందరపు విజయకుమార్ గట్టి పోటీ ఇస్తున్నారు. దాంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల ఈ నేతలను పార్టీలోకి తీసుకుని తన విజయావకాశాలను పెంచుకున్నారు. దాంతో వైసీపీ ఇక్కడ వెనకబడినట్లైంది. ఇదిలా ఉండగా తక్కువ జనాభా ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన  కన్నబాబురాజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉంటే టీడీపీ, జనసేన నుంచి కాపు సామజిక వర్గం అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మిగిలిన కులాల మద్దతు మీదనే ఇపుడు వైసీపీ విజయం ఆధారపడి వుంది. అయితే వ్యూహ రచన చేయడంలో దిట్ట అయిన కన్నబాబు రాజు చివరి నిముషంలోనైనా పరిస్థితిని అనుకూలం చేసుకుంటారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: