అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల క‌ల‌క‌లం ఊహించ‌ని మలుపు తిరుగుతోంది. అనూహ్య రీతిలో పెద్ద‌ప‌ల్లి ఎంపీ టికెట్‌ను మాజీ ఎంపీ వివేక్‌కు కాకుండా ఇటీవ‌లే పార్టీలో చేరిన బోర్ల‌కుంట వెంక‌టేశ్‌కు అందించి కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో వివేక్ భ‌గ్గుమ‌న్నారు. త‌న‌కు కేసీఆర్ ద్రోహం చేశార‌ని ఆరోపించారు. దానిపై టీఆర్ఎస్ సైతం ఘాటుగా స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీ వివేక్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించేందుకు కుట్ర చేశారనీ, అందుకే ఆయనకు టిక్కెట్టు ఇవ్వలేదనీ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే అంచనాతో వివేక్‌ అండతో ఆయన సోదరుడు వినోద్‌ బీఎస్పీ తరపున బెల్లంపల్లి నుంచి పోటీ చేశారన్నారు. అక్కడ తమ పార్టీ అభ్యర్థి చిన్నయ్యను ఓడించేందుకు విశ్వప్రయత్నం చేశారని ఆరోపిం చారు. మంచిర్యాల, మంథని, పెద్దపల్లి, ధర్మపురి నియోజక వర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి మరీ కుట్ర చేశారని అన్నారు. 


ఇలా ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు కొన‌సాగిన త‌రుణంలో తాజాగా వివేక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టిస్తూ, త‌న‌ అభిమానులకు వివేక్ మెసేజ్ పంపించారు.  `` ప్రియమైన మిత్రులారా, కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల నాకు టికెట్ రాలేదు. ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వొద్దనే కుట్రతో కావాలనే ఆలస్యంగా ప్రకటించారు. మీరు నాపై చూపే అభిమానం, సపోర్ట్ తో ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు చాలా ప్రయత్నం చేసినాను. కానీ తక్కువ టైం మాత్రమే ఉండటంతో మనము, మన గుర్తు ఎక్కువ మందికి చేరదు. బరిలో దిగాలని నాకు లోపల ఎంత ఉన్నప్పటికీ ఈ కారణంతో పోటీ చేయలేకపోతున్న. మీరు ఇన్నాళ్లు నాకు ఇచ్చిన సపోర్ట్ కు, నాపై చూపిన అభిమానానికి ధన్యవాదములు.
ఇట్లు గడ్డం వివేక్ వెంకటస్వామి`` అంటూ వివేక్ ఈ సందేశం పంపించారు.


కాగా, వివేక్ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ త‌ర‌ఫున టికెట్ కోసం ప్ర‌య‌త్నం చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఆ రెండు పార్టీల నుంచి ఎలాంటి హామీ ద‌క్క‌క‌పోవ‌డం వ‌ల్లే, ఆయ‌న పోటీ నుంచి విర‌మించుకున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా వివేక్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై టీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో మ‌రి. 



మరింత సమాచారం తెలుసుకోండి: