తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నది. కారు.. సారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు అనే నినాదంతో ముందుకెళ్తున్న అధికారపార్టీ ఓ వైపు...పోటీని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఇత‌ర పార్టీలు మరోవైపు బ‌రిలో దిగి తమ ఉనికిని చాటుకొనేందుకు తాపత్రయపడుతున్నాయి. అయితే, టీడీపీలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఊసేలేకుండా పోయింది. ఆ పార్టీ నుంచి ఒక్కొక్క నాయకుడు టీఆర్‌ఎస్ గూటికి చేరిపోయారు. నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో ఉన్న కొద్దిమంది నేతలతో సమావేశం ఏర్పాటుచేసినా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. 


త‌ద్వారా, రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కచోట కూడా పోటీచేయలేని దయనీయస్థితికి ఆ పార్టీ చేరుకుంది. తెలంగాణ నుంచి టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయినట్టేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదమూడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పోటీచేసిన టీడీపీ రెండుచోట్ల మాత్రమే గెలుపొందింది. ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికే కనిపించలేదు. ఆ ఎన్నికలు పార్టీ తరఫున జరిగేవి కాకపోవడంతో అప్పుడు అంతగా పట్టించుకోలేదు.


కానీ, తాజా పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లో ఒక్కస్థానం నుంచి కూడా ఆ పార్టీ తరఫున పోటీచేయడానికి ఎవరూ ముందుకురాలేదు. 37 ఏళ్ల‌ తరువాత తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీచేయకపోవడం తొలిసారి అని పలువురు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో ఇంత దీనస్థితికి చేరిపోవడంతో.. పార్టీ జాతీయాధ్యక్షుడిగా చెప్పుకొంటున్న చంద్రబాబు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక హైదరాబాద్‌లోనే పుట్టా.. ఇక్కడే పెరిగా అని చెప్పుకొన్న యువనేత లోకేశ్ పత్తాలేకుండాపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: