నర్సాపురం నియోజకవర్గంలో చంద్రబాబునాయుకు షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు టిడిపికి రాజీనామా చేశారు. బహుశా ఈరోజు వైసిపిలో చేరవచ్చు. నర్సాపురం ఎంఎల్ఏ టికెట్ ను కొత్తపల్లికి కేటాయిస్తానని చెప్పి చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చారట. దాంతో కొత్తపల్లి మండిపోతున్నారు. జనసేనను గెలిపించేందుకే చంద్రబాబు సొంత పార్టీ నేతలను కూడా దెబ్బ కొడుతున్నారంటూ కొత్తపల్లి ధ్వజమెత్తారు.

 

కాపు సామాజికవర్గానికి చెందిన కొత్తపల్లికి నర్సాపురంలో గట్టి పట్టేఉంది. కాకపోతే సొంతంగా గెలిచేంత సత్తా లేకపోయినా ప్రత్యర్ధిని ఓడించగలిగే సామర్ధ్యం మాత్రం పుష్కలంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో అదే జరగాలని కొత్తపల్లి కోరుకుంటున్నారు. తనను మోసం చేసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని కొత్తపల్లి గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకనే వైసిపిలో చేరారు.

 

వైసిపి నుండి ముదునూరి ప్రసాదరాజు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ నుండి బండారు మాధవనాయుడు పోటీలో ఉన్నారు. వైసిపి తరపున లోక్ సభకు పోటీ చేస్తున్న రఘురామ కృష్ణంరాజుకు కొత్తపల్లి సన్నిహితుడు. ఎప్పుడైతే కృష్ణంరాజు వైసిపి అభ్యర్ధయ్యారో అప్పటినుండే కొత్తపల్లి కూడా వైసిపిలోకి చేరుతారనే ప్రచారం బాగా జరుగుతోంది.

 

దానికి తగ్గట్లే కొత్తపల్లి నర్సాపురం టికెట్ కోసం పట్టుపట్టారు. సిట్టింగ్ ఎంఎల్ఏ మాధవనాయుడును కాదని టికెట్ తనకు ఇవ్వరని తెలిసే కొత్తపల్లి పట్టుబట్టారు. అనుకున్నట్లే జరగటంతో చివరకు టిడిపికి రాజీనామా చేసేశారు. ఏదేమైనా కొత్తపల్లి వైసిపిలో చేరటం కాస్త కలసివచ్చే అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే, చాలా నియోజకవర్గాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇటువంటి పరిస్దితుల్లో ఓ ఐదు వేల ఓట్లు వేయించగలరని అనుకున్న నేతలకు ఫుల్లుగా డిమాండ్ పెరిగిపోతోంది. కొత్తపల్లి పార్టీ మారటం కూడా అందులో భాగమే లేండి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: