గత కొంత కాలంగా ఏపిలో ప్రజాశాంతి అధినేత కేఏపాల్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.  తాను సీఎం ని అవబోతున్నానని..తన ప్రత్యర్థులు చంద్రబాబు,  జగన్, పవన్ కళ్యాన్ చిత్తు చిత్తు గా ఓడిపోతారని..కొంత మందికైతే డిపాజిట్లు కూడా రావని గాల్లోకి పంచ్ లు విసురుతూ మరీ చెప్పారు.  ఆయన చేస్తున్న వింత వింద చేష్టలకు ఓ వైపు నాయకులు అవహేళన చేస్తుంటే..ప్రజలు మాత్రం తెగ కామెడీ ఎంజాయ్ చేస్తున్నారు.  తాజాగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.


పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చెయ్యాలని భావించిన ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్లారు.  అయితే నామినేషన్ దాఖలు చేసే సమయం మించిపోవడంతో నామినేషన్ ను తీసుకోకుండా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.  కాగా, ఈ ఘటనపై కేఏ పాల్ మండిపడుతున్నారు. తన నామినేషన్ ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని ఆరోపిస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. కాగా, నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పాల్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. 


నరసాపురం అసెంబ్లీ నుంచి పోటీ చెయ్యాలని తొలుత పాల్ భావించారు.  కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనపై పోటీ చెయ్యనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భీమవరం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 3.30 గంటలకు చేరుకున్నారు.  నామినేషన్లు తీసుకునేందుకు 4గంటల లోపు రావాలని అయితే 4.10గంటలకు రావడంతో తీసుకోలేదని స్పష్టం చేసినట్లు కేఏ పాల్ తెలిపారు.


కాగా,  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భీమవరం నుంచి కూడా తాను పోటీ చేస్తానని పాల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు దూం..దాం చేసిన కేఏ పాల్ తానే సమయ పాలన పాటించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: